మార్కెట్‌కు పత్తి శోభ

10 Oct, 2014 02:49 IST|Sakshi
మార్కెట్‌కు పత్తి శోభ

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ గురువారం నుంచి కొత్త పత్తితో కళకళలాడుతోంది. సంప్రదాయం ప్రకారం వ్యాపారులు, కార్మికులు పూజలు నిర్వహించి కొత్త పత్తిని కొనుగోలు చేశారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్‌జావీద్ కొత్త పత్తి కొనుగోలును ప్రారంభించి సరుకు నాణ్యతను పరిశీలించారు. తొలిరోజు దాదాపు ఐదువేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. వీటిలో 1600 బస్తాల కొత్త పత్తి ఉంది. గురువారం పత్తి జెండా పాట రూ.4,001 పలికింది. వ్యాపారులు మాత్రం కింటాలుకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు మాత్రమే ధర చెల్లించారు. కొత్త పత్తి ధర కూడా రూ. 3,500కు మించ లేదు.

పత్తికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 4,050 కాగా గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గరిష్ట  (జెండా పాట)ధర కూడా ఆమాత్రం పలకలేదు. అంతర్జాతీయంగా పత్తి ధరలు మందగించాయని, ఎగుమతులు లేక ధర బాగా క్షీణించిందని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది పత్తిని నిల్వ చేసుకున్న రైతులను ఈ ధరలు బాగా దెబ్బతీశాయి. క్వింటాలుకు దాదాపు రూ.1500 నుంచి రూ.2000 వరకు పత్తి నిలువ పెట్టుకున్న రైతులు నష్టపోయారు. ఇంకా ధర పడిపోతుందనే భయంతో రైతులు నిలువ ఉంచిన పత్తిని అమ్ముకుంటున్నారు. దాదాపుగా నెల రోజులుగా పత్తి ధర తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది పత్తి ధర బాగా తగ్గే సూచనలు కనబడటంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను రంగంలోకి దించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

పత్తి ధర బాగా పడిపోయిందని వెంటనే సీసీఐని రంగంలోకి దించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా పత్తి ధర బాగా తగ్గిపోయిందని.. వ్యాపారులు మరీ దగా చేస్తున్నారని..తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సరుకు నాణ్యంగా ఉన్నా  కనీసం  ప్రభుత్వం ప్రకటించిన ధర కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సీసీఐని రంగంలోకి దించే విషయమై జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌ను మార్కెటింగ్ శాఖ అధికారులు గురువారం కలిశారు. జేసీ ద్వారా సీసీఐకి లేఖ రాసినట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్‌జావీద్ ‘సాక్షి’ కి తెలిపారు. ఇవే ధరలకు కొనుగోళ్లు జరిపితే రైతులు ఆందోళనకు దిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు