గర్భం ఇప్పుడే వద్దు!

8 Jul, 2020 06:52 IST|Sakshi

వాయిదా వేసుకుంటున్న దంపతులు

కరోనా సద్దుమణిగిన తర్వాతే కేరింతలు

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల ప్రాణాలు హరిస్తున్న మహమ్మారి పుట్టుకనే అడ్డుకుంటోందా? అమ్మా, నాన్న అని పిలిపించుకోవాలనుకుంటున్న నవ దంపతుల ఆశలపై భయం ఆవరిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సర్వేల ఫలితాలు అదే స్పష్టం చేస్తున్నాయి. కరోనా కోరలు ఎంత పెద్దవో ఎన్ని రకాలుగా సమాజాన్ని చుట్టేస్తున్నాయో వెల్లడిస్తున్నాయి. 

సాక్షి, సిటీబ్యూరో: జర్నల్‌ ఆఫ్‌ సైకో సోమాటిక్‌ రీసెర్చ్‌ గైనకాలజీ రిపోర్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సర్వేలు వెల్లడిస్తున్న ప్రకారం కరోనాకు కాస్త అటూ ఇటూగా పెళ్లి పీటలు ఎక్కిన దంపతులు, అంతకు ముందే పెళ్లయినా సరిగ్గా ఈ టైమ్‌లో పిల్లలను కందామని ప్లాన్‌ చేసుకున్నవారు, పిల్లలు పుట్టకపోవడమే సమస్యతో ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు.. ఇలా ఒకరనేమిటి? ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ప్రస్తుత సంక్షోభ సమయంలో  పిల్లలు కనడాన్ని దంపతులు వాయిదా వేసుకుంటున్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. నగరంలోనూ ఇదే పరిస్థితి ఉందని పలువురు వైద్యులు, గైనకాలజిస్ట్‌లు అంటున్నారు. ఈ సమయంలో పిల్లలు వద్దనుకోవడానికి కరోనా కారణంగా గర్భం దాల్చాక ఆరోగ్యం ఎలా ఉంటుందోననే ఆందోళనే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గర్భంతో ఉండగా కరోనా సోకితే ఎలా అనే భయంతో 73శాతం మంది పిల్లలు వద్దనుకుంటున్నట్లు రిపోర్ట్‌ వెల్లడించింది. దీనికి తోడు ప్రస్తుతం ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కూడా ప్రెగ్నెన్సీని వాయిదా వేస్తున్నట్లు 88శాతం మంది చెప్పారట. మరోవైపు ఇలా వాయిదా కారణంగా గర్భం ధరించాల్సిన వయసులో ధరించకపోవడం వల్ల వచ్చే ఇతరత్ర సమస్యలు ఉత్పన్నమవుతాయనే భయాలూ వెన్నాడుతున్నప్పటికీ.. వాయిదాకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు.

వీలైతే వాయిదా వేయడమే మేలు..
అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే ఓకే గానీ.., ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవాలనుకునేవారు మాత్రం కొంతకాలం వెయిట్‌ చేయమనే చెబుతున్నాం. గర్భిణిగా ఉన్నప్పుడు ఊపిరి తిత్తులు, గుండె.. ఇలా ప్రతి అవయవం మార్పునకు లోనవుతుంది. ఒక్కోసారి కొందరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంటుంది. ఇలాంటప్పుడు కరోనా ఎఫెక్ట్‌ అయితే కష్టం. ప్రస్తుతం కరోనాకు మెడిసిన్‌ కూడా లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్‌ వాయిదా వేసుకోవడమే మంచిదనే ఎక్కువ మంది భావిస్తున్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు కూడా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ప్లాన్స్‌ని హోల్డ్‌లో పెట్టాయి. వాయిదా వేసుకుంటే వయసురీత్యా వచ్చే మార్పులు ఉంటాయి కదా అనుకోవచ్చు. ఆ రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఎప్పుడూ ఉంటుంది. వయసు పైబడిన వారిలో ప్రెగ్నెన్సీ వస్తే బీపీలు, షుగర్‌ సమస్యలు ఎదుర్కోవడం తప్పదు. కానీ, అవన్నీ వేరు. ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు చాలా కీలకం. ఈ సమయంలో కోవిడ్‌ ఎఫెక్ట్‌ అయితే చికిత్స చేయడం కష్టం. సరైన ఫలితాలు కూడా రాకపోవచ్చు. అలాగని ఆల్రెడీ ప్రెగ్నెంట్‌గా ఉన్నవారు మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా తల్లి నుంచి బిడ్డకు ఏ విధంగా సోకుతుందనేది నిర్ధారించే స్టడీస్‌ ఏమీ లేవు.  – డాక్టర్‌ శిరీష, గైనకాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్, ముషీరాబాద్‌

>
మరిన్ని వార్తలు