జలమండలికి ఇద్దరు కొత్త సారథులు..

26 Jun, 2014 23:38 IST|Sakshi
జలమండలికి ఇద్దరు కొత్త సారథులు..

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో కీల కమైన మంచినీటి సరఫరా విభా గం జలమండలికి ప్రభుత్వం ఇద్దరు కొత్త సారథులను నియమించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చింది. గురువారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎం.జగదీశ్వర్ (1993 బ్యాచ్ ఐఏఎస్), ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అహ్మద్ బాబు (2003 బ్యాచ్ ఐఏఎస్) నియమితులయ్యారు.
 
జగదీశ్వర్ గతంలో రెండున్నరేళ్లకుపైగా జలమండలి ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎండీగా పనిచేసిన జె.శ్యామలరావును తప్పించారు. ఆయన ఏపీ సర్కార్‌లో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చినందునే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని తెలి సింది. ఆయన సుమారు 22 నెలలుగా ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. జలమండలి ఈడీగా ఉన్న జగన్మోహన్ ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడి కలెక్టర్ అహ్మద్ బాబు జలమండలి ఈడీగా నియమితులయ్యారు.
 
బదిలీల్లో కన్పించిన హరీష్‌రావు మార్క్..!
జలమండలి ఎండీ, ఈడీల బదిలీ విషయంలో బోర్డు గుర్తింపు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులైన ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. గతంలో జలమండలి మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేసిన ఎం.జగదీశ్వర్‌కు హరీష్‌రావు ఆశీస్సులున్నట్టు సమాచారం. అందుకే ఆయనకు తిరిగి కీలకమైన ఎండీ బాధ్యతలు అప్పగించడంలో హరీష్ చక్రం తిప్పినట్టు తెలిసింది. కలెక్టర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న ఈడీ డాక్టర్ జగన్మోహన్‌కు ఆదిలాబాద్ కలెక్టర్ బాధ్యతలు దక్కడం వెనుక హరీష్‌రావు సహకారం ఉన్నట్టు తెలుస్తోంది.
 
కొత్త ఎండీకి సమస్యలే స్వాగత తోరణం..

మూడున్నరేళ్లవిరామం తర్వాత తిరిగి జలమండలి ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎం.జగదీశ్వర్‌కు పలు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. అవి..
 
వివాదాస్పదమైన జీపీఈ(జనరల్ పర్పస్ ఎంప్లాయ్) పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడం. బోర్డులో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్, హెచ్‌ఆర్ కార్మికులకు న్యాయం చేయడం.సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న మంచినీటిలో సరఫరా నష్టాలను 40 నుంచి 20 శాతానికి తగ్గించాల్సి ఉంది.జలమండలికి రావాల్సిన రూ.200 కోట్ల నీటిబిల్లులను వసూలు చేయాలి. గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, మంచినీటి వసతులను కల్పించాలి. ఇందుకోసం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం రెండో దశ కింద మంజూరైన పనులు పూర్తిచేయాల్సి ఉంది.
 
ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్

జలమండలి నూతన మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులైన జగదీశ్వర్ గురువారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ప్రస్తుత ఎండీ శ్యామలరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. బదిలీ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన విధుల్లో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు