ఏడాదిలోనే కొత్త కలెక్టరేట్‌ భవనాలు

7 Jul, 2017 03:47 IST|Sakshi
ఏడాదిలోనే కొత్త కలెక్టరేట్‌ భవనాలు

రికార్డు సమయంలో నిర్మాణానికి కసరత్తు
♦  రూ.వేయి కోట్లతో పనులు
టెండర్ల తంతు పూర్తి, నెల రోజుల్లో పనులు షురూ
♦  వచ్చే ఏడాది దసరా నాటికి ప్రారంభోత్సవాలు


సాక్షి, హైదరాబాద్‌: యుద్ధప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లకు కొత్త భవనాలు సమకూరబోతున్నాయి. రికార్డు సమయంలో ఏడాదిలోనే 26 సమీకృత జిల్లాల పరిపాలన భవనాలు, కలెక్టర్‌ సహా ఇతర ఉన్నతాధికారుల క్యాంపు క్యారాలయ భవనాలు రూపుదిద్దుకోనున్నాయి. దాదాదపు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనుల టెండర్లు తాజాగా ఖరారయ్యాయి.

వెంటనే పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరా నాటికల్లా అవి అందుబాటులోకి తేవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. స్థలసేకరణ పూర్తయిన చోట పనులు మొదలు పెట్టేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థలాలకు సంబంధించి సమస్యలున్న చోట ప్రత్యామ్నాయ స్థలాల కోసం కసరత్తు చేస్తున్నారు. వాస్తుపరంగా ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు నియమితులైన సుద్దాల సుధాకర్‌తేజ, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డి గురువారం నుంచి స్థలాల పరిశీలన ప్రారంభించారు. ప్రభుత్వం తొలిదఫాగా రూ.600 కోట్లు విడుదల చేసింది.

అన్ని కార్యాలయాలు ఒకేచోట..: గతంలో కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఆర్డీఓ లాంటి ప్రధాన అధికారులు సహా కొన్ని విభాగాల జిల్లా అధికారుల కార్యాలయాలు మాత్రమే ఒక చోట ఉండేవి. మిగతా కార్యాలయాలు ఎక్కడ భవనం దొరికితే అక్కడ ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి విభాగాధిపతుల కార్యాలయాలన్నీ కలెక్టర్‌ కార్యాలయం ప్రాంగణంలోనే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.పర్యావరణ అనుకూల నమూనాతో హరిత భవనాలు నిర్మించనున్నారు. సమావేశ మందిరాలు, పార్కింగ్‌ వసతి, ఇంకుడు గుంతలు, సోలార్‌ వ్యవస్థ, పచ్చదనం ఉండేలా వీటిని తీర్చిదిద్దనున్నారు.

లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో..: ఈ భవనాలను మూడు అంతస్తుల్లో నిర్మి స్తారు. ఇందులో అవసరమైన జిల్లాల్లో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో సిద్ధం చేసి, మిగతా చోట్ల రెండు అంతస్తులను మాత్రమే అందుబాటులోకి తెస్తారు. భవిష్యత్తులో మిగతా అంతస్తును కూడా వినియోగించేలా ఏర్పాటు చేస్తారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌ అర్బన్, రంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కామారెడ్డి, మేడ్చల్‌లో మూడంతస్తులను తొలి దశలోనే సిద్ధం చేస్తారు.

మరిన్ని వార్తలు