కొత్త జిల్లాల వెనుకబాటు !  

18 Dec, 2017 02:59 IST|Sakshi

     అత్యంత వెనుకబడ్డ జిల్లాగా మహబూబాబాద్‌ 

     నీతి ఆయోగ్‌ నివేదికలో వెల్లడించిన ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబాటుతనంలో రాష్ట్రంలోని కొత్త జిల్లాలే ముందు వరసలో ఉన్నాయి. 31 జిల్లాల్లో మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు అత్యంత వెనుకబాటుతనంతో టాప్‌లో ఉన్నాయి. పాత జిల్లాలు ఉన్నప్పుడు వెనుకబాటుతనం, పేదరికంలో ముందు వరుసలో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా తాజాగా 14వ స్థానంలో నిలిచింది. ఇటీవల నీతి ఆయోగ్‌కు పంపించిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. 11 అంశాల ప్రాతిపదికగా జిల్లాల వెనుకబాటుతనాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. భూమి లేని నిరుపేద కూలీలు, గర్భిణుల సంరక్షణ, ఆసుపత్రుల్లో ప్రసవాలు, పిల్లల ఎదుగుదల, బరువు తక్కువగా ఉండటం, ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్లు, పిల్లలు–ఉపాధ్యాయుల నిష్పత్తి, కరెంటు, రోడ్డు, తాగునీరు లేని గ్రామాలు, మరుగుదొడ్లు లేని ఇళ్లను  ప్రామాణికంగా స్వీకరించింది. వీటన్నింటా ఆందోళనకర పరిస్థితులున్న జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది. ఈ అంచనా విధానాన్ని కేంద్రం కంపోజిట్‌ ఇండెక్స్‌గా పరిగణనలోకి తీసుకుంది. ఈ పరిస్థితులను మొత్తం 100 పాయింట్లకు ఎక్కువ పాయింట్లు సాధించిన జిల్లాల వరుసలో వెనుకబాటుతనాన్ని అంచనా వేసింది. వెనుకబడిన జిల్లాల జాబితాలో మొదటి 10 స్థానాల్లో మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్‌ రూరల్, నిర్మల్, సూర్యాపేట, వికారాబాద్, ఆదిలాబాద్‌లు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డితో పాటు సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలు అభివృద్ధిలో ముందంజలో నిలిచాయి. 

అంశాల వారీగా.. 
భూమి లేని నిరుపేద కూలీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో భూపాలపల్లి మొదటి స్థానం లో ఉంది. మహబూబాబాద్‌ రెండోస్థానంలో ఉండగా, సూర్యాపేట, ఆసిఫాబాద్‌ జిల్లాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. గద్వాల, మహబూబాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో ఇప్పటికీ విద్యుత్‌ లేని ఇళ్లున్నాయి. మరుగుదొడ్లు లేని ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాల్లో గద్వాల, వికారాబాద్, నిర్మల్‌లు ఉన్నాయి. తాగునీటి వసతి లేని గ్రామాలు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా ఉన్నాయి. 

మూడింటికి కేంద్ర సాయం.. 
ఈ నివేదిక ఆధారంగానే కేంద్రం సత్వర అభివృద్ధి పథకం అమలు చేసే వెనుకబడిన ప్రాంతాల జాబితాలో ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలకు అవకాశం కల్పించింది. తాము పంపిన ప్రతిపాదనల్లో మహబూబాబాద్, గద్వాల జిల్లాలు తీవ్ర వెనుకబాటుతనంతో ఉన్నాయని, వీటిని సైతం అందులో చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ అభ్యర్థనను నీతి ఆయోగ్‌కు లేఖ రాసింది. గతంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం (బీఆర్‌జీఎఫ్‌) పేరిట ఎంపిక చేసిన జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. మూడేళ్లుగా ప్రత్యేక అభివృద్ధి నిధి పేరిట ఈ నిధులను విడుదల చేస్తోంది. 10 జిల్లాలున్నప్పుడు హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 9 జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున రూ.450 కోట్లు విడుదల చేసింది. కొత్త పథకాన్ని న్యూ ఇండియా–2022 లక్ష్యంగా ఎంచుకోవడంతో ఎంపికైన జిల్లాలకు గతంలో కంటే భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. 

>
మరిన్ని వార్తలు