కొత్త జిల్లాలపై కసరత్తు షురూ!

6 Sep, 2014 02:14 IST|Sakshi
కొత్త జిల్లాలపై కసరత్తు షురూ!

ఉన్నతాధికారులతో  సీఎం కేసీఆర్ చర్చ
జిల్లా పరిధి ఐదు అసెంబ్లీ లేదా ఒక పార్లమెంట్ నియోజకవర్గం
దశలవారీగా ప్రక్రియ  చేపట్టాలని యోచన

 
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 24 జిల్లాలకు పెంచుతామని కేసీఆర్ ఎన్నికల ప్రచార సమయంలోనూ వెల్లడించిన విషయం విదితమే. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహిం చిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్చించారు. కొత్తగా ఏర్పాటుచేయాలనుకున్న జిల్లా కేంద్రాలపై సాధ్యాసాధ్యాల నివేదికను తెప్పించుకోవాలని ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2019లో పునర్వ్యవస్థీకరణ అనంతరం జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ జిల్లాల ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి కొత్తగూడెం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి కసరత్తు అనంతరమే ఈ జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. శుక్రవారం జరిగిన సమావేశం కేవలం ప్రాథమిక సమావేశమేనని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఒకేసారి కాకుండా దశలవారీగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్లతో సమావేశం..

ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల తొలిదశ బడ్జెట్ కసరత్తు పూర్తయింది. కొంతమంది టాస్క్‌ఫోర్స్ అధికారులు శుక్రవారం ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఆయా టాస్క్‌ఫోర్స్ కమిటీలు రూపొందించిన నివేదికలను కేసీఆర్‌కు వివరించారు. బడ్జెట్ రూపకల్పనలో టాస్క్‌ఫోర్స్ కమిటీల నివేదికలను పరిగణ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు.

వాటర్‌గ్రిడ్‌పై....

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వాటర్‌గ్రిడ్‌పై గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ఇంజనీర్లతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 650కి పైగా ఇంజనీర్లతో హైదరాబాద్‌లో ఒకరోజు సమావేశం నిర్వహించి.. వారికి వాటర్‌గ్రిడ్‌పై పూర్తిగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు