జూలై 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ

4 Jun, 2015 02:19 IST|Sakshi
జూలై 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ

* ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు మంత్రి పద్మారావు ఆమోదం
* ముఖ్యమంత్రి వద్ద ఫైలు, ఆమోదమే తరువాయి
* వైన్‌షాపుల పెంపు, చౌక మద్యం విక్రయాలకు మొగ్గు
* రెవెన్యూ లక్ష్యం రూ. 12,227 కోట్లు
* కల్తీ మద్యం, బెల్టుషాపులను నిర్మూలిస్తామన్న ఎక్సైజ్ కమిషనర్

 
సాక్షి, హైదరాబాద్: సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో నాటుసారా (గుడుంబా)ను అరికట్టడం, బెల్టుషాపులను ఎత్తివేయడంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 12,227 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని సాధించే దిశగా విధివిధానాలను రూపొందించింది. ప్రస్తుత విధానంలోని లోటుపాట్లను వివరిస్తూ.. మహారాష్ట్రలో అమల్లో ఉన్న దేశీదారూ తరహాలో చౌక మద్యాన్ని వైన్‌షాపుల ద్వారా విక్రయించడం, జనాభాను బట్టి మద్యం దుకాణాలను పెంచడం వంటి ప్రతిపాదనలను తయారుచేసింది. మద్యంతో సంబంధం లేకుండా సారాను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదననూ రూపొందించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను ఆర్నెల్లుగా అధ్యయనం చేసిన అనంతరం వాటి లోటుపాట్లనూ పరిశీలించి అధికారులు ఈ నివేదికలను రూపొందించారు. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు ఆ శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ ఆమోదం తెలిపారు. దీంతో వాటిని సీఎం పరి శీలనకు పంపారు. ఈ నెల తొలివారంలో సీఎం ఆమోదం లభించిన వెంటనే జూలై 1 నుంచి   రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలు కానుంది.
 
 చౌక మద్యానికి సర్కారు మొగ్గు
 కొద్ది నెలల క్రితం సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో విచ్చలవిడి గుడుంబా అమ్మకాలపై ఫిర్యాదులందాయి. గుడుంబాకు బదులుగా మహారాష్ట్రలో విక్రయిస్తున్న దేశీదారూ తరహాలో తక్కువ ధర మద్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ఆయన భావిం చారు. ఈ మేరకు మంత్రి పద్మారావు, అధికారులతో పలుమార్లు సమావేశమై చర్చించారు. ఎక్సైజ్ అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదికలు అందించారు. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వీ చంద్రవదన్ మహారాష్ట్రలో పర్యటించి దేశీదారూ అమ్మకాల వివరాలను తెలుసుకున్నారు. అక్కడ రెగ్యులర్ మద్యం అమ్మకాల కన్నా దేశీదారూ వల్లే ఎక్కువ రెవెన్యూ వస్తోందని తేలింది.
 
 ఈ నేపథ్యంలో చౌక మద్యం, 10 వేల జనాభాకు ఓ మద్యం దుకాణం ఏర్పాటు, లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ఫీజులను రెగ్యులరైజ్ చేయడం తదితర అంశాలతో కొత్త మద్యం విధానం ఉండాలని ఎక్సైజ్ శాఖ తేల్చినట్లు సమాచారం. ఈ విధానంతో వచ్చే రెవెన్యూ వివరాలనూ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. సీఎం కూడా ఇందుకు సానుకూలంగా ఉండటంతో కొత్త విధానాన్ని ఈ వారంలోనే ఆమోదించే అవకాశముంది. రాష్ట్రంలో నాటుసారా తయారీ, బెల్టు షాపులు ఉండకూడదన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే నూతన విధానాన్ని రూపొందించినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు