వైద్య శాఖలో త్వరలో ఉద్యోగాల భర్తీ

25 Nov, 2019 02:47 IST|Sakshi

కరీంనగర్‌లో కొత్త ఆస్పత్రి నిర్మిస్తాం

మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

కరీంనగర్‌: వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆదివారం ఆయన కరీంనగర్‌ జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో మూడు, నాలుగు చొప్పు న 700 పైగా గురుకుల పాఠశాలలు ఏర్పా టు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అంది స్తున్నామన్నారు.

పేద ప్రజలు వ్యాధులబారిన పడినప్పుడు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులను పెంచుతున్నామని, ఉన్న ఆస్పత్రుల్లో కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అన్ని ఆస్పత్రుల్లో వంద శాతం డాక్టర్లు, సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీవితంలో అనుకోకుండా వచ్చేవి వైద్య ఖర్చులని మంత్రి అన్నారు. అనుకోని వైద్య ఖర్చుల నుంచి పేదవారిని రక్షించేలా ప్రభుత్వం ఉచిత వైద్య సేవల సెంటర్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవలందించేది వైద్య శాఖ అని, మెరుగైన వైద్యంతోనే ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా సేవలందిస్తామని చెప్పారు. త్వరలో కరీంనగర్‌లో కొత్త ఆస్పత్రి నిర్మిస్తామన్నారు.

మరిన్ని వార్తలు