పొగమంచు ఉన్నా.. కూ చుక్‌చుక్‌

14 Dec, 2019 00:41 IST|Sakshi

రైల్వే వ్యవస్థలో సరికొత్త పరికరం అందుబాటులోకి

సిగ్నళ్లు, మార్గం తెలుసుకునేలా ‘ఫాగ్‌ పాస్‌’

జీపీఎస్‌ ఆధారిత పరికరం వినియోగంలోకి

స్క్రీన్‌పై సూచనలు, మార్గం ప్రత్యక్షం..

500 మీటర్ల ముందు వాయిస్‌ ద్వారా అప్రమత్తం

సాక్షి, హైదరాబాద్‌: చలికాలంలో పొగమంచుతో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వాహనదారులకు రోడ్డు కనిపించక జరిగే ప్రమాదాలెన్నో. ఇలాగే రైల్వే వ్యవస్థలో కూడా ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతాయి. పొగమంచు కారణంగా సిగ్నల్స్‌ కనిపించకపోతే ఇక అంతే సంగతులు. భారీ ప్రమాదాలు జరుగుతాయి.

అందుకే మంచు దట్టంగా కమ్ముకునే సమయంలో రైళ్లను కనిష్ట వేగానికి నియంత్రించి నడుపుతుంటారు. లొకోపైలట్‌ రైలును నెమ్మదిగా నడుపుతూ, సిగ్నల్స్‌ను గమనిస్తూ ముందుకు సాగుతుంటారు. దీంతో చాలా రైళ్లు ఆలస్యంగా నడవటం, కొన్నింటిని రద్దు చేయాల్సి రావటం జరుగుతాయి. ఇప్పుడీ సమస్యకు అధికారులు పరిష్కారం కనుగొన్నారు.

ఫాగ్‌ పాస్‌.. 
ఈ పొగమంచు సమస్యకు పరిష్కారంగా ‘ఫాగ్‌పాస్‌’పేరుతో ఓ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు అధికారులు. జీపీఎస్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందులో స్క్రీన్‌ ఉంటుంది. సంబంధిత రైలు మార్గాన్ని జీపీఎస్‌ ద్వారా ఈ పరికరానికి అనుసంధానిస్తారు. ఆ మార్గంలో ఎక్కడెక్కడ సిగ్నళ్లు ఉన్నాయి.. ఎక్కడ సూచిక బోర్డులున్నాయి.. స్టేషన్లు.. మలుపులు, లెవల్‌ క్రాసింగ్స్‌.. ఇలా అన్ని వివరాలు అందులో కనిపిస్తాయి.

రైలు వెళ్తున్న కొద్దీ మార్గంలో ముందున్న మూడు వివరాలు స్క్రీన్‌లో కనిపిస్తాయి. అవి ఎంత దూరంలో ఉన్నాయో స్పష్టం చేస్తుంది. 500 మీటర్ల దూరంలో ఉందనగా వాయిస్‌ రూపంలో అప్రమత్తం చేస్తుంది. దీంతో రైలు వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేకుండానే ముందుకు దూసుకెళ్లొచ్చు.

కకోద్కర్‌ కమిటీ సలహాతో..
2011లో హైలెవల్‌ సేఫ్టీ రివ్యూ కమిటీని కకోద్కర్‌ నేతృత్వంలో రైల్వే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రైల్వే భద్రతకు సంబంధించి 106 సిఫారసులు చేసింది. వాటిల్లో 68 పూర్తిస్థాయిలో అమలు చేయదగ్గవని రైల్వే బోర్డు గుర్తించింది. మరో 19 పాక్షికంగా అమలు చేయదగ్గవని గుర్తించింది. 68 సూచనల్లో ఈ ఫాగ్‌ పాస్‌ పరికరం కూడా ఉంది. దీన్ని స్థానికంగానే అభివృద్ధి చేశారు. కిలోన్నర బరువుండే ఈ పరికరంలో దృశ్య, శ్రవణ విధానం ఉంటుంది.

క్రూ బుకింగ్‌ కేంద్రాల వద్ద వీటిని ఉంచి, రైలు బయల్దేరే సమయంలో లోకోపైలట్లకు అందిస్తారు. మళ్లీ డ్యూటీ పూర్తి కాగానే వారు దాన్ని సంబంధిత విభాగానికి అప్పగించాల్సి ఉంటుంది. గతేడాది ఈశాన్య భారతంలోని కొన్ని రైల్వే జోన్లకు ఈ పరికరాలు అందించారు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. తొలి దఫాగా జోన్‌ పరిధిలో 250 పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. కాగా, పొగమంచు కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలను ఈ పరికరంతో అధిగమించొచ్చని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు