హైదరాబాద్‌.. ఐటీ దౌడ్‌..!

18 Feb, 2019 03:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గ్రేటర్‌ శివార్లకు ఐటీ కంపెనీల వరద ..

రెండేళ్లలో 55 కొత్త సంస్థల ఏర్పాటు

జాబితాలో సయెంట్, వాల్యూ ల్యాబ్స్, వర్చూసా, యాక్సెంచర్, ఏడీపీ

రాబోయే రెండేళ్లలో ఐటీ, హార్డ్‌వేర్‌ కంపెనీలు

3.30 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం

21,444 కోట్లుపెట్టుబడులు..

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ శివార్లకు ఐటీ కంపెనీలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా తీసుకొచ్చిన టీఎస్‌–ఐపాస్‌ విధానంతో మూడేళ్లుగా ఐటీ, హార్డ్‌వేర్‌ కంపెనీలతోపాటు తయారీ రంగం, ఏరోస్పేస్, ఫార్మా రంగం లోని దిగ్గజ పరిశ్రమలు వందలాదిగా నగర శివార్లలో కార్యకలాపాల ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో సయెంట్, వాల్యూ ల్యాబ్స్, వర్చూసా, యాక్సెంచర్, ఏడీపీ వంటి కంపెనీలున్నాయి. 

ఆర్నెల్లుగా నగర శివార్లలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మహేశ్వరం, బుద్వేల్‌ తదితర ప్రాంతాల్లో ప్రధానంగా ఐటీ, హార్డ్‌వేర్‌ కంపెనీల ఏర్పాటుకు 55 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. రాబోయే రెండేళ్లలో వీటి ఏర్పాటు ద్వారా 3.30 లక్షలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కంపెనీల ఏర్పాటుతో రూ.18,400 కోట్ల పెట్టుబడుల ప్రవాహానికి అవకాశం ఉంది. ఆర్నెల్లలో పరిశ్రమల ఏర్పాటుకు 255 దరఖాస్తులు అందగా ఇందులో 60 తయారీరంగం, మరో 80 ప్లాస్టిక్, 40 ఏరోస్పేస్‌ విడిభాగాలు, 20 ఫార్మా కంపెనీలున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. 

2015 నుంచి పరిశ్రమల వెల్లువ 
పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రవాహానికి దారులు తెరవడం, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌–ఐపాస్‌కు పరిశ్రమల వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రధానంగా 2015 నుంచి గ్రేటర్‌ శివారు ప్రాంతాల్లో వివిధ రకాల కంపె నీల ఏర్పాటుకు సుమారు 800 దరఖాస్తులు అం దగా.. ఇందులో ఇప్పటికే 478 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని.. వీటి ఏర్పాటుతో సుమారు 28 వేల కోట్లపెట్టుబడులు నగరానికి తరలివచ్చాయని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీల్లో 3.29 లక్షలమందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దక్కాయన్నాయి. రాబోయే 2, 3 ఏళ్లలో మిగతా పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు. 
 
గ్రేటర్‌ ఐటీ కంపెనీల్లో ఉపాధి ఇలా.. 
తెలంగాణా ఆవిర్భావం అనంతరం గ్రేటర్‌లో సుమారు వంద చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ప్రధానంగా శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఆయా కంపెనీల్లో నూతనంగా 50 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. గ్రేటర్‌ కేంద్రంగా ఇప్పటికే బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు 647 ఐటీ కంపెనీల శాఖలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 5 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు