ఐటీ కోర్స్‌.. హైటెక్‌ జాబ్స్‌

11 Feb, 2020 08:51 IST|Sakshi

సిటీలో సరికొత్త కోర్సులు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 30 అటానమస్‌ కళాశాలల్లో అందుబాటులోకి

సాక్షి, సిటీబ్యూరో: జాబ్‌ మార్కెట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న సాంకేతిక కోర్సులకు నగరంలో డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మార్గదర్శకాల ప్రకారం నగరంలో జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలోని సుమారు 30 అటానమస్‌ కళాశాలలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ కోర్సులు ప్రవేశ పెట్టాల్సిన ఆవశ్యకతపై ఇటీవల ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్‌.. ఆయా కళాశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన సాంకేతిక  కోర్సులు తమ కళాశాలల్లో పరిచయం చేయాలని ఆదేశించింది. వీటిలో ప్రధానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బిజినెస్‌ అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ తదితర కోర్సులు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఆయా కళాశాలల్లో అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక కోర్సులు... వాటికి విద్యార్థుల నుంచి లభిస్తున్న ఆదరణ, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్, నూతనంగా ప్రవేశపెట్టబోయే కోర్సులపై అటానమస్‌ కళాశాలలు తమకు నివేదిక సమర్పించాలని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆదేశించింది.   

టెకీల చూపు.. హైటెక్‌ కోర్సుల వైపు
విశ్వవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని ఇటీవల గడగడలాడించిన ర్యాన్‌సమ్‌వేర్‌.. వానా క్రై వైరస్‌ వంటి ఉపద్రవాలతోపాటు డిజిటల్‌ యుగంలో పెరుగుతోన్న సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు, సేవారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, పలు రకాల సేవల సరళీకరణకు ఉద్దేశించిన సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తదితర కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ్‌ బాగా పెరుగుతోంది. హైటెక్‌సిటీగా పేరొందిన గ్రేటర్‌ నగరంలోనూ ఇప్పుడిప్పుడే టెకీలు ఈ కోర్సులవైపు దృష్టిసారిస్తున్నారు. బీటెక్,ఎంటెక్‌ పూర్తిచేసినవారు..ఇప్పటికే ఐటీ,సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నవారు సైతం సైబర్‌ సెక్యూరిటీ కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ కోర్సులు నేర్చుకున్నవారికి ఆయా కంపెనీలను బట్టి అనుభవాన్ని బట్టి జీతభత్యాలు లభిస్తుండడం విశేషం. నూతనంగా ఉద్యోగంలో చేరిన టెకీ కంటే హైటెక్‌ కోర్సులు పూర్తి చేసినవారికి రెట్టింపు వేతనాలు లభిస్తున్నట్లు తెలిసింది.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం
ఇటీవలికాలంలో సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, బిజినెస్‌ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో తెలంగాణ అకాడమీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్స్,నాస్‌కామ్,జేఎన్‌టీయూ నిపుణుల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు విడతల వారీగా పలు అంశాలను నేర్పిస్తున్నాము. ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమాలకు విద్యార్థులు,టెకీలు,కంపెనీల నుంచి డిమాండ్‌ అధికంగా ఉంది.
– జయేష్‌రంజన్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి

మరిన్ని వార్తలు