ఐసీడీఎస్‌లో కొలువులు

26 Aug, 2014 01:55 IST|Sakshi

ఇందూరు: ఐసీడీఎస్‌లో ఉద్యోగాల జాతర జరగనుంది. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి నోచుకోనున్నాయి. ఇప్పటికే ఐసీడీఎస్ అధికారులు  ఖాళీల సంఖ్యను గుర్తించారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 ఖాళీలతో ఇక్కట్లు
 జిల్లాలో 27 మినీ, 42 మెయిన్, మొత్తం 69 అంగన్‌వాడీ కేంద్రాలలకు కార్యకర్తలు లేక ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. కొద్ది నెలల క్రితం 22 మంది సీనియర్ అంగన్ వాడీ కార్యకర్తలు గ్రేడ్-2 సూపర్‌వైజర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో ఖాళీల సంఖ్య పెరిగింది. అంగన్‌వాడీ కేంద్రాలను నడిపించడం సాధ్యం కావడం లేదు. ఐ సీడీఎస్ పీడీ రాములు జిల్లాలోని ఖాళీలను భర్తీ చేయడానికి ఫైలు సిద్ధం చేశారు. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులను ఆహ్వానించను న్నారు. గతంలో ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పారదర్శంగా పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 అర్హత పదవ తరగతి
 అంగన్‌వాడీ కేంద్రానికి ముఖ్య నిర్వాహకురాలిగా పనిచేసే కార్యకర్త పోస్టులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదవ తరగతి ప్రధాన అర్హతగా నిర్ణయించారు. 21- 30 ఏళ్లలోపువారు మాత్రమే అర్హులు. స్థానికులై ఉండాలి. దరఖాస్తుల అనంతరం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే,ఆర్‌డీఓ, ఐసీడీఎస్ పీడీ, వైద్యాధికారి నలుగురు కలిసి మెరిట్ మార్కులతో పాటు అభ్యర్థులకు ముఖ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో చేసుకోవాల్సి ఉంటుంది.

 సూపర్‌వైజర్ పోస్టుల సంగతేందీ
 అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీచేస్తున్న అధికారులు, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ విషయాన్ని తెరపైకి తేవడంలేదు. గతంలో నాలుగు జిల్లాలకు కలిపి సూప ర్‌వైజర్ పోస్టులను భర్తీచేశారు. కాగా కొన్ని మిగిలిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 20 సూపర్‌వైజర్ పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి.

ఇవి భర్తీకి నోచుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీలను పర్యవేక్షించడం వీరి విధి. అంగన్‌వాడీ పోస్టులతో పాటు సూపర్‌వైజర్ పోస్టులను నింపితే ఐసీడీఎస్‌కు సిబ్బంది కొరత కొంత వరకు తీరుతుంది. కార్యకర్తల పోస్టుల భర్తీ అధికారం జిల్లా అధికారులకే ఉంటుంది. సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ఐసీడీఎస్ కమిషనర్‌కు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ పోస్టు లు భర్తీకి నోచుకోవడంలేదు.

మరిన్ని వార్తలు