నవంబర్‌ నుంచి నూతన మద్యం పాలసీ అమలు

7 Oct, 2019 09:37 IST|Sakshi

ప్రతి సీసాపై రూ.10 పెంపు

అక్టోబర్‌ నెల కోసం ప్రత్యేక ధర

ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు

సాక్షి, బాల్కొండ: మద్యం సిండికేట్‌ ఇష్ట్యారాజ్యానికి కొందరు ఎక్సైజ్‌ అధికారులు మద్దతునిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మద్యం పాలసీ అమలు కావడానికి మరో నెల రోజుల సమయం ఉండటంతో పాత వైన్సులకే లైసెన్స్‌ను ఒక నెల రెన్యూవల్‌ చేసిన విషయం విదితమే. అక్టోబర్‌ మాసానికి లైసెన్స్‌ ఫీజు చెల్లించిన మద్యం వ్యాపారులు ప్రతి సీసాపై రూ.10 ధర పెంచి వినియోగదారుల జేబులు గుళ్ల చేస్తున్నారు. అక్టోబర్‌ నెలకు మద్యం సిండికేట్‌ చెప్పిన ధరకే వినియోగదారులు మద్యంను కొనుగోలు చేయాల్సి వస్తుంది. మద్యం సిండికేట్‌పై పలువురు ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న సందర్భాలు కనిపించడం లేదు. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి కొనుగోలు చేసే ఒక్కో మద్యం సీసాపై ప్రత్యేక ధరను వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం ఎంఆర్‌పీ ధరల ప్రకారమే మద్యంను విక్రయించాల్సి ఉంది. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సదరు వైన్స్‌లను సీజ్‌ చేసే అధికారం ఎక్సైజ్‌ అధికారులకు ఉంది. కానీ అక్టోబర్‌ నెల అంతా ప్రత్యేక ధరకే మద్యం విక్రయిస్తామని మద్యం వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు.

నవంబర్‌ నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుంది. ఒక నెల లైసెన్స్‌ ఫీజు చెల్లించి మద్యం విక్రయిస్తే తమకు గిట్టుబాటు కాదని మద్యం వ్యాపారులు ఎక్సైజ్‌ అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా మద్యం దుకాణాల లైసెన్స్‌లను ఖచ్చితంగా రెన్యూవల్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎక్సైజ్‌ అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకవచ్చారు. అయితే ఈ నెల కోసం అదనంగా లైసెన్స్‌ ఫీజును చెల్లించే సమయంలో మద్యం వ్యాపారులు కొందరు మొండికేయడంతో వారిని బుజ్జగించడంలో భాగంగా ధర పెంచుకోవడానికి ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కో సీసాపై రూ.10 పెంచి విక్రయించుకోవడానికి ఎక్సైజ్‌ అధికారులు అనధికార అనుమతులు ఇవ్వడంతో మద్యం వ్యాపారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మద్యం సీసాల పరిమితితో తేడా లేకుండా ప్రతి సీసాపై రూ.10 ధర హెచ్చింపు చేయడం ద్వారా రూ.లక్షల్లో అదనపు ఆదాయం మద్యం సిండికేట్‌కు సమకూరనుంది. ఎక్సైజ్‌ అధికారులు నోరు మెదపకుండా ఉండటానికి మద్యం సిండికేట్‌ నుంచి ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రూ.10 ధర పెంపు ఈ నెలకోసమే అని వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.  

రెండు దుకాణాలకు జరిమానా విధించినా.. 
ఎంఆర్‌పీ ధరలకు కాకుండా మద్యం ధరలను పెంచి విక్రయిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎక్సైజ్‌ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని రెండు దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానా కూడా విధించారు. అయినా మద్యం వ్యాపారులు తమ తీరును మార్చుకోలేదు. రూ.10 ధర పెంచి మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు.  

ఎంఆర్‌పీకే విక్రయించాలి 
మద్యాన్ని ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు నిబంధనల ప్రకారం మద్యం విక్రయించాలి.  
– డేవిడ్‌ రవికాంత్, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ 

మరిన్ని వార్తలు