మందుబాబులకు కిక్కిచ్చే వార్త!

5 Sep, 2019 11:57 IST|Sakshi

విక్రయాలు అధికంగా ఉన్నచోట మరో షాపు

తక్కువ అమ్మకాలున్న దుకాణాల తరలింపు 

సాక్షి, నిజామాబాద్‌: అమ్మకాలు తక్కువగా నమోదైన మద్యం షాపులను అధిక విక్రయాలు జరుగుతున్న ప్రాంతాలకు తరలించాలని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది. ఈ మేరకు జిల్లాలో తక్కువ విక్రయాలు జరుగుతున్న షాపులను గుర్తించాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈనెలాఖరుతో మద్యం షాపుల లైసెన్సుల గడువు ముగుస్తుంది. దీంతో నూతన ఎక్సైజ్‌ విధానం అమలు కోసం ఆశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం షాపుల వారీగా మద్యం అమ్మకాల లెక్కలు తీస్తున్నారు. ఆయా షాపుల్లో నెల వారీగా ఎంత మొత్తంలో మద్యం విక్రయాలు జరిగాయనే నివేదికను సిద్ధం చేశారు. కాగా జిల్లాలో ఇలా తక్కువ మద్యం అమ్మకాలున్న షాపుల వివరాలు త్వరలో తేలనున్నాయి. 

త్వరలో నోటిఫికేషన్‌..?
జిల్లాలో మొత్తం 95 మద్యం షాపులు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈనెల 31తో ముగుస్తుంది. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి కొత్త లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈలోగా కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈవారంలోగా నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశాలున్నట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో మద్యం షాపులకు వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి లైసెన్సులను మంజూరు చేశారు. లైసెన్సు ఫీజుతో పాటు, బ్యాంకు గ్యారెంటీలు తీసుకుని లైసెన్సులు ఇచ్చారు.

ఏడాదికి రూ. 45 లక్షలు ఒక స్లాబ్‌గా, రూ. 55 లక్షలు మరో స్లాబుగా లైసెన్సు ఫీజు నిర్ధారించి షాపులను కేటాయించారు. జనాభా ప్రాతిపదికన నిజామాబాద్‌ నగరంతో పాటు, బోధన్‌ పట్టణాల పరిధిలోని 28 మద్యం షాపులకు రూ. 55 లక్షలుగా లైసెన్సు ఫీజు వసూలు చేయగా, మిగిలిన 67 షాపులకు రూ. 45 లక్షల లైసెన్స్‌ ఫీజు తీసుకున్నారు. ప్రభుత్వం అక్టోబర్‌ నుంచి అమలు చేయనున్న ఈ నూతన మద్యం విధానం ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మద్యం షాపుల కోసం దరఖాస్తు ఫీజును ఈసారి భారీగా పెంచే యోచనలో ఎక్సైజ్‌శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానానికి సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఇక్కడి ఎక్సైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

మద్యం షాపులకు డిమాండ్‌.. 
మద్యం షాపులకు ఈసారి భారీ డిమాండ్‌ ఉండే అవకాశాలున్నాయి. గత రెండేళ్లలో వ్యాపారులకు మద్యం షాపులు కాసుల వర్షం కురిపించడంతో ఈసారి ఎలాగైనా షాపులను దక్కించుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గుత్తేదార్లు ఈసారి మద్యం వ్యాపారం వైపు చూస్తున్నారు. చెరువులు, కుంటలు, ఫార్మేషన్‌ రోడ్లు, ఇతర భవనాలు వంటి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసే గుత్తేదార్లకు సరిగ్గా బిల్లులు రావడంలేదు. దీంతో ఆ పనులు చేసేందుకు ఆసక్తి చూపని వారంతా ఈసారి మద్యం షాపుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా