చాళుక్య కళా సృష్టికి కొత్త రూపు

30 Sep, 2017 03:27 IST|Sakshi
పునరుద్ధరణ జరిగే ఏకవీర దేవాలయం

వరంగల్‌ శివారులోని మొగిలిచెర్లలో ఉన్న ఏకవీర దేవాలయం

పదకొండు శతాబ్దాల నాటి అద్భుత మందిరం

దాని సమీపంలో కొలువైన నాటి జైన గుహలు

అద్భుత శిల్పకళ.. ఎవరూ పట్టించుకోక శిథిలావస్థ

పునరుద్ధరించేందుకు సిద్ధమైన ప్రభుత్వం

పేర్వారం రాములు ప్రతిపాదనతో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: విశాలమైన ఆలయ ప్రాంగణం.. అద్భుత శిల్పకళ.. నగిషీలు చెక్కిన స్తంభాలు.. గర్భగుడిలోనే అంతర్గత ప్రదక్షిణ పథం ఉన్న సాంధార నమూనా మందిరం.. కాకతీయుల కులదైవంగా భావిస్తున్న ఏకవీర ఎల్లమ్మదిగా చరిత్రకారులు పేర్కొంటున్న ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారు. ఇందులో మూలవిరాట్టు లేకపోవటంతో ఇంతకాలం ఎవరూ పట్టించుకోవడం లేదు. శిథిలావస్థలో చెట్లు, పొదల మధ్య చిక్కుకుపోయిన ఈ ఆలయానికి మహర్దశ రానుంది. తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి కావడంతో దీనిని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌ శివార్లలోని మొగిలిచెర్ల గ్రామంలో ఉన్న ఈ ఏకవీర ఆలయాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పేర్వారం రాములు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ప్రతిపాదించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. పర్యాటకాభివృద్ధి సంస్థ, పురావస్తు శాఖల ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 

ఆకట్టుకునే జైన గుహలు
ఈ ఆలయ సమీపంలోని రాళ్లలో తొలిచిన జైన గుహలు ఆకట్టుకుంటాయి. పెద్ద రాతి గుండ్లను తొలిచి గుహలుగా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాంతంలో జైనమత ప్రాబల్యం ఉండటంతో వరంగల్‌ పద్మాక్షి గుట్ట, అగ్గలయ్య గుట్ట, చుట్టుపక్కల ప్రాంతాల్లో జైనుల ఆవాసాలు ఏర్పడ్డాయి. వారి విద్యాలయాలు కొనసాగాయి. ఆ క్రమంలోనే జైన మునులు ధ్యానం చేసుకునేందుకు ఇలాంటి గుహలు ఏర్పాటు చేశారని చెబుతారు. ఏకవీర ఆలయం సమీపంలో ఇలాంటి మూడు గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా వాటినీ ప్రాచుర్యంలో తేనున్నట్టు పేర్వారం రాములు ‘సాక్షి’కి వెల్లడించారు. 

ఇబ్బందుల మధ్య..
వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే ఏకవీర ఆలయం పునరుద్ధరణ జరగాల్సి ఉంది. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి దీనికి రూ.40 లక్షలు కేటాయించారు. పురావస్తు శాఖ టెండర్లు కూడా పిలిచినా.. పనులు మొదలుపెట్టలేదు. తర్వాత ఆ నిధులను వేరే పనులకు మళ్లించారు. ప్రస్తుతం ఈ ఆలయానికి వెళ్లేందుకు దారి కూడా లేదు. చుట్టూ పట్టాభూములు కావటంతో రోడ్డు నిర్మాణం జరగలేదు. ఈ నేపథ్యంలో స్థానికులతో మాట్లాడి రోడ్డు నిర్మించటంతోపాటు విద్యుత్‌ వసతి కల్పించనున్నారు. పునరుద్ధరణ తర్వాత ఇది కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. 

అరుదైన తరహాలో.. 
సాధారణంగా దేవాలయాల్లో గర్భ గుడి చుట్టూరా ప్రత్యేక మంటపాలు ఉండవు. భక్తులు గర్భగుడి వెలుపల.. ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ సాంధార నమూనాలో నిర్మించే ఆలయాల్లో ప్రదక్షిణ పథం అంతర్గతంగానే ఉంటుంది. గర్భాలయం చుట్టూ భక్తులు తిరిగేందుకు ప్రత్యేకంగా నిర్మాణం ఉంటుంది. ఇలాంటి తరహా ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. వరంగల్‌లోనే ఉన్న భద్రకాళి మందిరం, పరకాల–ఘన్‌పూర్‌ దారిలో ఉన్న గుడిమెట్ల శివాలయం, బయ్యారంలోని ఓ పురాతన మందిరం.. ఇలా వేళ్లమీద లెక్కించే సంఖ్యలో ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. కాకతీయులకు పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన కళ్యాణి చాళుక్యులు ఏకవీర ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించారు.

ఇందులో ఏకవీర ఎల్లమ్మను కొలిచినట్లు పూర్వీకుల ద్వారా తెలిసినా.. దానికి సంబంధించి శాసనాలు, ఆధారాలేమీ లభించలేదు. ఇక మొగిలిచెర్ల ఊరు అసలు పేరు మొగిలి చెరువుల అని.. అక్కడి చెరువుల్లో విస్తృతంగా మొగిలిపూల వనం ఉండటంతో ఆ పేరొచ్చిందని చెప్పే శాసనాలు మాత్రం లభించినట్టు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిల్లో ఈ దేవాలయం ప్రస్తావన కొద్దిగానే ఉందని, ఏకవీర ఎల్లమ్మ ప్రస్తావనేదీ లేదని పేర్కొంటున్నారు. అయితే ఏకవీర ఎల్లమ్మను కులదైవంగా భావించిన కాకతీయులు ఈ దేవాలయంలో నిత్యం పూజలు నిర్వహించేవారని మాత్రం చరిత్రకారులు చెబుతారు. కాకతీయుల పతనం తర్వాత ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. అందులోని మూలవిరాట్టును ఎవరో ఎత్తుకుపోయారు. మూల విరాట్టు లేక, పూజలు నిలిచిపోవటంతో భక్తుల రాక ఆగిపోయింది. చివరికి ఆలయం శిథిలావస్థకు చేరింది. అద్భుత శిల్పసంపదతో కూడిన స్తంభాలు పక్కకు ఒరిగిపోయాయి. 

మరిన్ని వార్తలు