సాగునీటి శాఖకు కొత్త రూపు!

16 Feb, 2020 03:06 IST|Sakshi

పునర్వ్యవస్థీకరణ కొలిక్కి 

సీఎం సూచనల మేరకు మార్పులు చేర్పులు 

ఎస్సారెస్పీ ఆయకట్టు లోయర్‌ మానేరు వరకు... సాగర్‌ ఆయకట్టు పాలేరు ఎగువకే కట్టడి 

పంప్‌హౌస్‌ల పర్యవేక్షణకు బేసిన్‌ల వారీగా ఇద్దరు సీఈలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి శాఖ పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మార్పుచేర్పులతో కూడిన ప్రక్రియ ముగింపు దశకు రాగా దీనికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం దక్కనుంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి కావస్తుండటం.. కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో విప్లవాత్మక చర్యలు అత్యంత కీలకం కానున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేనున్నారు. ఈఎన్‌సీలు, సీఈల వారీగా ఏయే ప్రాజెక్టులు ఉంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉంటుందన్న దానిపై కసరత్తు పూర్తయింది. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో మెకానికల్, ప్రెషర్‌ మెయిన్స్, పంప్‌హౌస్‌ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్‌ల వారీగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల పనులు చూసేందుకు బేసిన్ల వారీ ఇద్దరు సీఈలు ఉండే అవకాశం ఉంది.  

ప్రక్షాళన ఇలా... 
- కరీంగనర్‌ డివిజన్‌ కాళేశ్వరం ఈఎన్‌సీ పరిధిలో 3 బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో పాటు ఎల్లంపల్లి బ్యారేజీతో పాటు దానికింద మిడ్‌మానేరు వరకు నీటిని ఎత్తిపోసే ప్యాకేజీలన్నీ రానున్నాయి. ఈ బ్యారేజీల పరిధిలో కొత్తగా చేపట్టే ఎత్తిపోతలు దీని పరిధిలోనే ఉండనున్నాయి. ఈఎన్‌సీ కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు ఉండనుంది. 
- శ్రీరాంసాగర్‌ సీఈ పరిధిలో లోయర్‌మానేరు వరకు మాత్రమే ఆయకట్టును పరిమితం చేయనున్నారు. దీంతోపాటుగా కడెం, సదర్‌మఠ్, ఆదిలాబాద్‌లోని కాళేశ్వరం ఆయకట్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ఉండనున్నాయి. మొత్తంగా 7.42లక్షల ఆయకట్టు ఉంటుంది. 
- కరీంనగర్‌లోని మరో ఈఎన్‌సీ పరిధిలో లోయర్‌మానేరు నుంచి దిగువన సూర్యాపేట వరకు ఉన్న ఆయకట్టును కొత్తగా చేర్చారు. దీంతో పాటే ఎల్లంపల్లి దిగువ ఆయకట్టు, మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్, దానికింద ఆయకట్టును తెచ్చారు. మధ్యతరహా ప్రాజెక్టులు ఈఎన్‌సీ కిందే ఉండనున్నాయి. మొత్తంగా 13లక్షల ఎకరాల ఆయకట్టు ఈఎన్‌సీ పరిధిలో ఉండనుంది. 
- నిజామాబాద్‌ సీఈ పరిధిలోకి కాళేశ్వరంపై ఆధారపడ్డ నిజాంసాగర్‌ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. సీఈ కింద 6.82 లక్షల ఆయకట్టు ఉంటుంది.  
- వరంగల్‌ సీఈ పరిధిలో దేవాదుల, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా కొత్తగా సమ్మక్క బ్యారేజీని చేర్చారు. ఆయకట్టు 6.07 లక్షల ఎకరాలు. 
- ఆదిలాబాద్‌ సీఈ పరిధిలో ప్రాణహిత, చనాకా–కోరటా, పెనుగంగ, కుప్టి, కొమరంభీంతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు. మహబూబ్‌నగర్‌ సీఈ పరిధిలో జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఉండ నుండగా, ఆయకట్టు 11.95 లక్షల ఎకరాలు. 
- పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ఒక్క సీఈ పరిధిలో ఉండనుంది. ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలు. 
- నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్‌ ఆయకట్టు పాలేరు వరకు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు, డిండి, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 10.97 లక్షల ఎకరాలు.
- ఖమ్మం సీఈ పరిధిలో సీతారామ, సీతమ్మసాగర్, పాలేరు దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ఆయకట్టు, భక్తరామదాస, మధ్యతరహా పథకాలు ఉంటాయి. ఆయకట్టు 7.16 లక్షల ఎకరాలు. 
- హైదరాబాద్‌ డివిజన్‌ కాళేశ్వరం ఈఎన్‌సీ పరిధిలో మిడ్‌మానేరు నుంచి గంధమల వరకు ఉన్న ప్యాకేజీలతో పాటు, కొత్తగా సింగూరు, ఘణపూర్, మధ్యతరహా ప్రాజెక్టులను చేర్చారు. ఆయకట్టు 11.54 లక్షలు. 

మరిన్ని వార్తలు