త్వరలో కొత్త మార్కెట్ చట్టం:హరీష్‌రావు

16 Oct, 2016 19:09 IST|Sakshi
త్వరలో కొత్త మార్కెట్ చట్టం:హరీష్‌రావు

హైదరాబాద్: ప్రస్తుతమున్న చట్టంలో మార్పులు చేర్పులు చేసి త్వరలో కొత్త మార్కెట్ చట్టం తీసుకొస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీష్‌రావు వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్యదర్శులు, ఇతర అధికారులకు ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ల కారణంగా 56 మంది మహిళలు ఛైర్మన్లుగా ఎంపికయ్యారన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాన్ని మార్కెట్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదట జనగాం మార్కెట్‌లో ఏర్పాటు చేస్తామని... దశలవారీగా అన్ని మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 30 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశామని... మరో 10 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

రైతు బంధు పథకం వల్ల గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు ఉచితంగా మార్కెట్ యార్డులకు చెందిన గోదాముల్లో దాచుకోవచ్చని... ఆ సమయంలో ఎలాంటి షరతులు లేకుండా వారికి ధాన్యం విలువలో 70 శాతం సొమ్ము ఇస్తామన్నారు. ఆరు నెలల్లో ఎప్పుడు ధర వచ్చినా వారు వచ్చి వాటిని విక్రయించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 30 వేల చెరువులు పొంగి పొర్లాయని... 10 వేల చెరువుల్లో 50 నుంచి 70 శాతం నిండాయన్నారు. రైతుకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ. 4,600 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రైతు, రైతు ఆధారిత, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిపై బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 41 వేలు ఖర్చు చేస్తుందని తెలిపారు.

మరిన్ని రైతు బజార్లు
మార్కెట్ కమిటీ ఛైర్మన్లు తెల్లవారుజామునే మార్కెట్లకు వెళ్లి సాయంత్రం వరకు ఉండాలని అప్పుడు సమస్యలు రావన్నారు. నామ్’ అమలులో ఇంకా సర్వర్ సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడర్లతోనూ త్వరలో సమావేశం నిర్వహించి వారి సహకారాన్ని కోరుతామన్నారు. గోదాములు, షెడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించవద్దన్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉల్లి, టమాట పంటలకు కనీస మద్దతు ధర అమలు చేస్తున్నామన్నారు.

టాప్-3 అవార్డులు
బాగా పనిచేసే మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్యదర్శులకు టాప్-3 అవార్డులు ఇస్తామన్నారు. కనీస మద్దతు ధర కల్పించడం, మార్కెట్ యార్డుల్లో చిన్న గొడవ కూడా రాకుండా చూడడం వంటి వాటిని అమలు చేసే వారికి ఈ అవార్డులు దక్కుతాయన్నారు. ప్రతీ రబీ, ఖరీఫ్ సీజన్లలో ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మార్కెట్లలో ఫర్నీచర్ కోసం వాటి స్థాయిని బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఇస్తామన్నారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో మార్కెట్లను పరిశీలించేందుకు రెండు విడతలుగా మార్కెట్ కమిటీ ఛైర్మన్లను పంపిస్తామన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు మంచిగా పనిచేస్తే భవిష్యత్తులో రైతులను ఓటర్లుగా మార్చుకునే వీలుంటుందని... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో అందరూ చప్పట్లు చరిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్, మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్, సీసీఐ ప్రతినిధి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు