పుష్కర ప్రణామం

17 Jul, 2015 00:49 IST|Sakshi
పుష్కర ప్రణామం

అమావాస్యతో పోటెత్తిన భక్తులు
 
గోదావరిలో పెద్దలకు పిండప్రదానం
మూడో రోజు 45 వేల మంది భక్తుల రాక
ఎండలతో ఇబ్బంది పడుతున్న భక్తులు
మంచినీరు, నీడ కోసం తండ్లాట

 
హన్మకొండ : అమావాస్య నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు గురువారం భక్తులు పోటెత్తారు. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం పుష్కరఘాట్లలో పెద్దలకు సంప్రదాయబద్ధంగా పిండప్రదానం చేశారు. అయితే మండుతున్న ఎండలతో భక్తులు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు, నీడ కోసం తండ్లాడారు. పుష్కరాల మూడో రోజున జిల్లాలో 45,000 మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొదటిరోజు 15,000 మంది భక్తులు రాగా... రెండో రోజు ఈ సంఖ్య 30,000కు చేరుకుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పుష్కరఘాట్లతో పోల్చితే జిల్లాలోని పుష్కరఘాట్లలో రద్దీ తక్కువగా ఉండడంతో  భక్తులు ఇటువైపునకు మక్కువ చూపుతున్నారు. గురువారంమంగపేట పుష్కరఘాట్‌లో 35,000, రామన్నగూడెంలో 10,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రెండు ఘాట్లలో కలిపి దాదాపు ఆరువేలకు పైగా పిండప్రదానాలు జరిగినట్లు అధికారుల అంచనా. అయితే రామన్నగూడెం పుష్కరఘాట్‌కు బస్సులు రద్దు చేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముల్లకట్ట పుష్కరఘాట్ వద్దకు గోదావరిలో నీటిని మళ్లించాలంటూ ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు ముల్లకట్ట పుష్కరఘాట్‌కు కేటాయించిన పురోహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ముల్లకట్టకు భక్తులు రాకపోవడంతో తమకు ఇక్కడ ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇతర ఘాట్లకు కేటాయించాల్సిందిగా అధికారులను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కోరారు.

 జేసీ పర్యవేక్షణ
 పెరుగుతున్న భక్తుల సంఖ్యకనుగుణంగా సౌకర్యాలు, సహాయకార్యక్రమాలు కల్పించడంలో జిల్లా అధికారులు తలామునకలయ్యూరు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం రెండు ఘాట్లను పరిశీలించారు. రామన్నగూడెంలో కిలోమీటరున్నర దూరంలో ఉన్న గోదారి నీటిపాయ వద్దకు స్వయంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. భక్తులు స్నానాలు ఆచరించే స్థలాల్లో మంచినీటి సౌకర్యం, షామియానాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రక్షిత మంచినీరు అందించేందుకు ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించారు. ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ రెండుఘాట్ల వద్దకు వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఘాట్ల వద్ద ఇబ్బంది కలగకుండా మైకుల ద్వారా తగు సూచనలు చేయాలంటూ ఆదేశించారు. నది లోపల లోతైన ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు పడవల్లో తిరుగుతూ గస్తీ కాశారు. ములుగు డీఎస్పీ రాజామహేంద్రనాయక్ స్వయంగా పడవలో తిరిగి పరిశీలించారు. మంగపేట బస్‌స్టేషన్ నుంచి పుష్కరఘాట్ వరకు భక్తులను మినీబస్సులు, మ్యాజిక్‌ల ద్వారా తరలించారు.

 మంగపేటలో చలువ పందిళ్లు
 పుష్కరఘాట్‌లో స్నానాలు చేసే స్థలం వద్ద నీడను ఇచ్చే ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం ఉదయం మంగపేట పుష్కరఘాట్‌లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు కేవలం మూడు షామియానాలు ఏర్పాటు చేసినా.. అవి భక్తుల అవసరాలను తీర్చలేకపోయాయి. మరో తొమ్మిది రోజులు పుష్కరాలు కొనసాగాల్సి ఉన్నందున మరిన్ని చలువ పందిళ్లను నిర్మించాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. పుష్కరఘాట్లు, నదీలో పరిసరాలు శుభ్రంగా ఉంచేలా పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్నారు. రామన్నగూడెంలో పుష్కరఘాట్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో భక్తులు స్నానాలు చేసే చోట ఏర్పాటు చేసిన షామియానాలు పడిపోయాయి. రామన్నగూడెంలో సైతం చలువ పందిళ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది.

 ఎండవేడితో విలవిల
 పుష్కరఘాట్లకు వచ్చే భక్తులు ఎండవేడి మికి విలవిలలాడుతున్నారు. నదీతీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు సరిపోవడం లేదు. రామన్నగూడెంలో భక్తులను తరలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టరు సేవలు రెండో రోజుకే అర్ధంతరంగా ఆగిపోయాయి. మండే ఎండల్లో రానుపోనూ మూడుకిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. దీంతో భక్తులకు పుష్కరస్నానం భారంగా మారుతోంది. నదిలో భక్తులు నడిచివెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇసుక బస్తాల మార్గం వెంట నీడ ఇచ్చేందుకు చలువ పందిళ్లు, డ్రమ్ముల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు లేకపోవడంతో భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే 35 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రత మరింత పెరిగితే భక్తులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి నీడ, నీరు  సౌకర్యం కల్పించాల్సి ఉంది.
 
 

మరిన్ని వార్తలు