పని చేస్తేనే పదవి ఉంటది!

10 Jan, 2020 02:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొత్త మున్సిపల్‌ చట్టంతో బాధ్యతల నిర్వహణ తప్పనిసరి

వార్డుల్లో పరిశుభ్రత, పచ్చదనం పరిరక్షించాలి 

నాటిన మొక్కల్లో 85 శాతం బతక్కపోతే పదవి పోయినట్లే 

మేయర్లు/ చైర్‌పర్సన్లకూ మినహాయింపు లేదు..

సాక్షి, హైదరాబాద్‌: పనిచేస్తేనే పదవి ఉంటుంది.. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రదర్శించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, దురుసుగా ప్రవర్తించినా సస్పెన్షన్‌కు గురికావడం లేదా పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. మేయర్, చైర్‌పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్‌ పదవులను ఇకపై అధికార దర్పం, దర్జా, పలుకుబడి కోసం వాడుకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరిచింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 120 మంది చైర్‌పర్సన్లు, 9 మంది మేయర్లు, 2,727 మంది కౌన్సిలర్లు, 385 కార్పొరేటర్లను ఎన్నుకోబోతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన వారు తమ అధికార, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు. ఏదైనా కారణాలతో అర్ధంతరంగా పదవి నుంచి తొలగింపునకు గురైతే .. మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధాన్ని ఎదుర్కో వాల్సిందే. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం మేయర్లు/చైర్మన్లు, కార్పొరేటర్లు/కౌన్సిలర్లు తప్పనిసరిగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఇవీ.. 

చైర్‌పర్సన్‌/మేయర్‌ బాధ్యతలు 

  • పట్టణం/నగరం పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ.
  • నివాస, వాణిజ్య సముదాయాల నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ.  
  • గ్రీన్‌ సెల్‌ ఏర్పాటు చేసి బడ్జెట్‌లో 10 శాతం నిధులను మొక్కల పెంపకం కోసం కేటాయింపు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించిన మున్సిపాలిటీలో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచాలి. సొంత వార్డులో నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • పార్కుల అభివృద్ధి, చెరువుల పరిరక్షణ.  
  • ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల పరిరక్షణ.  
  • ఏటా వార్షిక అకౌంట్ల ముగింపు, ఆడిటింగ్‌కు చర్య తీసుకోవాలి.  
  • పురపాలక ఆస్తుల అతిక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి.
  • నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి. అవసరం ఉంటే తప్ప నీటి సరఫరా కోసం విద్యుత్‌ బోర్లు వాడరాదు.  
  • వర్షపు నీటి సంరక్షణతో పాటు ఈసీబీసీ ప్రమాణాలతో చల్లని పైకప్పు గల ఇంధన పొదుపు భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి.  
  • మున్సిపల్‌ చట్టంలో నిర్దేశించిన అధికారాలు, బాధ్యతలతో పాటు ప్రభుత్వం ఆదేశించే ఇతర అధికారాలు, బాధ్యతలను సైతం నిర్వర్తించాలి.
  • కౌన్సిల్‌ సమావేశం ముగిసిన 24 గంటల్లోగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు(మినట్స్‌)పై సంతకం చేయాలి.
  • నర్సరీ నిర్వహణ, మొక్కల పెరుగుదల బాధ్యత మేయర్‌/చైర్‌పర్సన్, కమిషనర్లది. నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం తీరును పరిశీలించేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌తో ఆకస్మిక తనిఖీలు నిర్వ హించే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 

వార్డు సభ్యుల బాధ్యతలు.. 

  • వార్డులో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ. ఇంటింటి నుంచి చెత్త సేకరణ. శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ. చెరువుల పరిరక్షణ. 
  • నీటి సరఫరా (అక్రమ నల్లాలు), వృథా నీటి ప్రవాహాన్ని(పైపులైన్ల లీకేజీతో) నియంత్రించాలి. అవసరం ఉంటేతప్ప నీటి సరఫరా కోసం విద్యుత్‌ బోర్లను వాడరాదు. 
  • మున్సిపల్‌ గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం తమ వార్డులో మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. పట్టణాభివృద్ధిపై శిక్షణ తీసుకోవాలి.  
  • నాటిన మొక్కల్లో 85 శాతం బతికి ఉండేలా చూడాలి. నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా ఈ శాతానికి మొక్కలు తగ్గితే వార్డు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు. ఈ విషయంలో ప్రత్యేకాధికారి విఫలమైనా ఉద్యోగం నుంచి తొలగిస్తారు.

నిర్లక్ష్యం వహిస్తే తొలగింపే.. 

  • మున్సిపల్‌ చట్టం నిబంధనలు, ఇతర నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులను అమలుపరిచేందుకు నిరాకరించినా/ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా  
  • బాధ్యతలు, కర్తవ్యం నిర్వహణలో విఫలమైనా 
  • మున్సిపల్‌ చట్టం ప్రకారం పురపాలన సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం/ప్రభుత్వం నియమించిన ఇతర ఏ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు నిరాకరించినా 
  • విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కలిగి ఉన్నా.. 
  • మున్సిపల్‌ నిధులను దుర్వినియోగపరిచినా.. 
  • పురపాలికల బాధ్యతల నిర్వహణలో తరచూ విఫలమైనా, తన బాధ్యతలను విస్మరిస్తూ అసమర్థుడిగా తయారైనా.. 
  • ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిస్తుంది. తొలగించడానికి ముందు సంజాయిషీ ఇచ్చుకోవడానికి అవకాశమిస్తుంది. అనర్హత పడితే మరో 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు కానున్నారు.

దాడులు చేస్తే సస్పెన్షన్‌..
పురపాలికల అధికారులు, ఉద్యోగుల పట్ల స్థానిక కౌన్సిలర్లు, చైర్‌పర్సన్లు దురుసుగా ప్రవర్తించడం, దూషణలకు దిగడం, కొన్ని సందర్భాల్లో భౌతికదాడులకు పాల్పడడం వంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే పదవి కోల్పోవాల్సిందే. ఉద్దేశపూర్వకంగా అమర్యాదగా ప్రవర్తించినా, తోటి సభ్యుడు/ఉద్యోగిపై చేయి చేసుకున్నా, ఆస్తి ధ్వంసం చేసినా, అసభ్య పదజాలం వాడినా, మున్సిపల్‌ సమావేశాన్ని ఆటంకపరిచినా, పురపాలిక ఆర్థిక సుస్థిరకు నష్టం కలిగించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడినా సదరు చైర్‌పర్సన్‌/ వైస్‌చైర్‌పర్సన్‌/ వార్డు సభ్యుడిని సస్పెండ్‌ చేస్తూ గెజిట్‌ నోటీసు జారీ చేస్తుంది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు తమంతట కానీ, కౌన్సిలర్, చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్, కమిషనర్, ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గానీ జిల్లా కలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. సస్పెన్షన్‌ విధిస్తే 30 రోజుల్లోగా మున్సిపల్‌ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌ చేసుకోవచ్చు.  

>
మరిన్ని వార్తలు