13 జిల్లాల్లో కొత్తగా ఆయిల్‌ఫాం యూనిట్లు 

26 Jun, 2020 02:40 IST|Sakshi

కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఆయిల్‌ఫాం ప్రాసెసింగ్‌ యూనిట్లు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి గురువారం ఆయిల్‌ఫెడ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం ఆమోదం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములు గు, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 24 జిల్లాల్లో కొత్తగా 7.73 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగు చేయాలని సర్కా రు నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, భూపాలపల్లి, ములుగు, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, నారాయణపేట్‌ జిల్లాల్లో కొత్తగా అదనంగా ఆయిల్‌ఫాం సాగు చేయనున్నారు. ఈ విషయంపై రైతులను చైతన్యం చేస్తామని ఆయన తెలిపారు.

ఆయిల్‌ఫెడ్‌ టర్నోవర్‌ రూ.554 కోట్లు..  
ఆయిల్‌ఫెడ్‌ టర్నోవర్‌ గణనీయంగా పెరిగింది. గత ఆరేళ్లతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా రెండింతలకు మించి పెరిగినట్లు ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు వెల్లడించాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.237.48 కోట్లు ఉండగా, 2019–20లో ఏకంగా రూ.554 కోట్లు పెరిగినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు