కొత్త పంచాయతీలు 226..!

26 Jan, 2018 17:43 IST|Sakshi
మావల గ్రామ పంచాయతీలో మ్యాపులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌

జిల్లాలో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు

మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో అభిప్రాయ సేకరణ

మావల, బట్టిసావర్గాంలో అభ్యంతరం

నేడో రేపో ఖరారయ్యే అవకాశం

సాక్షి, ఆదిలాబాద్‌ : జిల్లాలో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల వివరాలు కొలిక్కి వస్తున్నాయి. ఈ నెల 16న సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లో కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల సమావేశం అనంతరం ఇదివరకు రూపొందించిన కొత్త జీపీల ప్రతిపాదనల్లో కొంత మార్పులు చేర్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకపక్క కొత్త గ్రామపంచాయతీల వివరాలను రూపొందిస్తూనే మరోపక్క ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల విషయంలో గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైన పక్షంలో స్వల్పంగా మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. జిల్లాలో 243 గ్రామపంచాయతీలు ఉండగా, తాజాగా కొత్త జీపీ(గ్రామ పంచాయతీ)ల ఏర్పాటు విషయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీరాజ్‌ ఏఈలు గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అవి తుది దశకు వస్తున్నాయి.

తాజా మార్పులు చేర్పులకు ముందు జిల్లాలో 225 గ్రామాల కోసం అప్పట్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అందులో 300 జనాభాకు తక్కువ ఉన్న గ్రామాలను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అర కిలోమీటర్‌ దూరమున్నవి కూడా పరిగణనలోకి తీసుకున్నారు. తాజాగా జరిగిన మార్పుల్లో 300 జనాభాకు తక్కువ ఉన్న గ్రామాలను, అర కిలోమీటర్‌ దూరంలో ఉన్న వాటిని దీంట్లో నుంచి తొలగించారు. గ్రామపంచాయతీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఎస్సీ, 
గ్రామాలను స్పెషల్‌ కేటగిరీలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని గ్రామపంచాయతీల కోసం కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇలా 226 గ్రామపంచాయతీలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. గురువారం వరకు ఉట్నూర్, నార్నూర్‌ మండలాలు మినహాయించి మిగతా మండలాల వివరాలు వచ్చాయి. దీనిపై శుక్ర, శనివారాల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 25 వరకే కొత్త ప్రతిపాదనలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దానిని 31 వరకు పొడిగించారు.  


కలెక్టర్‌ అభిప్రాయ సేకరణ..
జిల్లాలోని ఏకైక ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో విలీనం చేసే గ్రామాల విషయంలో కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 7గంటల వరకు ఆయా గ్రామాలను సందర్శించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి జితేందర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్, ఇతర అధికారులతో కలిసి ఆమె గ్రామాలకు వెళ్లారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మావల, కచ్‌కంటి, అనుకుంట, బట్టిసావర్గాం, రాంపూర్, బెల్లూరి, నిషాన్‌ఘాట్‌ గ్రామాలను విలీనం చేయాలని ఇదివరకు ప్రతిపాదనలు రూపొందించారు. నిషాన్‌ఘాట్, బెల్లూరి మినహాయించి మిగతా అన్ని గ్రామాల్లో కలెక్టర్‌ విస్తృతంగా పర్యటించి అభిప్రాయాలను సేకరించారు.

ప్రధానంగా మావల, కచ్‌కంటి, బట్టిసావర్గాం గ్రామాల ప్రజలు మున్సిపాలిటీలో విలీనంపై వ్యతిరేకత చూపారు. ప్రధానంగా మున్సిపాలిటీలో విలీనమైన పక్షంలో ఉపాధిహామీ కింద కూలీ పనులను కోల్పోయే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్‌కే కాలనీ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద రావడంతో దాని విషయంలోనూ ఆలోచన చేస్తున్నారు. సాయంత్రం వరకు అభిప్రాయ సేకరణ అనంతరం కలెక్టర్‌ రాత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఈ విషయంలో చర్చించారు. విలీన గ్రామాల విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. శుక్ర, శనివారాల్లోనే ఇదికూడా తుదిదశకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మావల, బట్టిసావర్గాం గ్రామపంచాయతీల్లోని మిగతా గ్రామాలను మున్సిపాలిటీలో కలిపే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా టీచర్స్‌ కాలనీ, దస్నాపూర్, కైలాస్‌నగర్, టైలర్స్‌కాలనీ, పిట్టలవాడ, దుర్గానగర్‌ కాలనీలు ఇప్పటికే పట్టణంలో కలిసిపోయినట్టు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాలను కలిపి మావల, బట్టిసావర్గాం గ్రామాలను గ్రామపంచాయతీలుగానే ఉంచే అవకాశాలు లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే మేజర్‌ గ్రామపంచాయతీ అయిన మావల చిన్నపాటి గ్రామపంచాయతీగా మిగిలిపోనుంది. బట్టిసావర్గాంది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఈ రెండుమూడు రోజుల్లో గ్రామపంచాయతీల వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. 


రెండు రోజుల్లో కొలిక్కి..
గ్రామపంచాయతీల ఏర్పాటు కొలిక్కి వస్తోంది. వివిధ అంశాల ఆధారంగా పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడున్న 243 గ్రామపంచాయతీలకు అదనంగా మరో 226 గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో 47 గ్రామాలు మాత్రమే 500 జనాభాకు లోబడి ఉన్నాయి. మిగతా 179 గ్రామాలు 500 జనాభాకు పైబడి ఉన్నాయి. 
– జితేందర్‌రెడ్డి, డీపీఓ, ఆదిలాబాద్‌

 

మరిన్ని వార్తలు