కొత్త ‘పంచాయితీ’!

31 Mar, 2018 01:57 IST|Sakshi

సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య ఆధిపత్య పోరు

జాయింట్‌ చెక్‌ పవర్‌తో ఇబ్బందులు

గ్రామాల్లో రెండు అధికార కేంద్రాలతో అభివృద్ధికి ఆటంకం

నామమాత్రంగా మిగలనున్న గ్రామ కార్యదర్శులు

గ్రామ పాలనలో కఠిన నిబంధనలు

ఇళ్ల లేఔట్ల అనుమతులకు ఆన్‌లైన్‌ విధానం

కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో నిబంధనలు

సాక్షి, హైదరాబాద్‌ : పంచాయతీరాజ్‌ చట్టంలో వస్తున్న మార్పులతో సరికొత్త ‘పంచాయితీ’మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌పవర్‌ అంశం గ్రామ రాజకీయాల్లో కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో రాజకీయ పోరు ఉధృతం అవుతుందని, రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయనే భావన వస్తోంది. చెక్‌పవర్‌ ఉన్న కారణంగా గ్రామ పాలనా వ్యవహారాల్లో ఉప సర్పంచ్‌ల జోక్యం పెరిగే అవకాశముంది. మరోవైపు గ్రామ కార్యదర్శులు నామమాత్రంగా మిగిలిపోనున్నారు.

కార్యదర్శులకు కత్తెర వేసి..
ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, వేతనాలు, ఇతర పనుల కోసం నిధుల ఖర్చు అంశం సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు ఉంది. వారిద్దరూ సంతకాలు చేస్తేనే నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రామ సభ నిర్ణయం మేరకు నిధులు ఖర్చు చేస్తారు. అయితే అత్యవసర పనులు, కార్యక్రమాలకు గ్రామ కార్యదర్శి, సర్పంచ్‌ల ఆమోదంతో నిధులు విడుదల చేస్తారు. కానీ ఇక ముందు కార్యదర్శులు గ్రామ ప్రణాళికల రూపకల్పన, పన్నుల వసూలు, ధ్రువపత్రాల జారీ, గ్రామసభల నిర్వహణ విధులకు పరిమితం కానున్నారు.

గ్రామ రాజకీయాల్లో కొత్త మార్పు
సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వడం గ్రామ రాజకీయాల్లో మార్పులు తెచ్చే పరిస్థితి ఉందని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో ఇన్నాళ్లు సర్పంచ్‌ ఎన్నికలకు మాత్రమే పోటీ ఉండేదని, ఇప్పుడు ఉప సర్పంచ్‌ పదవి కోసం పోరు ఉంటుందని అంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేయనందున.. ప్రస్తుతమున్నట్టుగానే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించిన రోజే ఫలితాలు వస్తాయి. అదే రోజు వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఇప్పటివరకు ఉప సర్పంచ్‌ పదవికి పెద్దగా పోటీ ఉండేదికాదు. కానీ చెక్‌పవర్‌ రానుండడంతో సర్పంచ్‌ పదవితో సమానంగా పోటీ పెరగనుంది.

ఆధిపత్య పోరుకు అవకాశం..!
జాయింట్‌ చెక్‌పవర్‌ కారణంగా సర్పంచ్‌గా ఎన్నికైనవారికి, ఉప సర్పంచ్‌గా ఎన్నికైన వారికి మధ్య ఆధిపత్య పోరు నెలకొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి మధ్య సయోధ్య నెలకొనని పరిస్థితి ఉంటే గ్రామ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళలు తదితర వర్గాలకు సర్పంచ్‌ పదవులు రిజర్వు అయిన చోట ఉప సర్పంచులు ఆధిపత్యం చెలాయించడం ఇప్పటికే జరుగుతోంది. తాజాగా చెక్‌పవర్‌తో ఇది మరింత ఉధృతమవుతుందని అంటున్నారు. ఇక సర్పంచ్‌ లేని సందర్భాల్లో గ్రామ పరిపాలన అంతా ఉప సర్పంచ్‌ చేతుల్లోనే ఉంటుంది. దీనికితోడు తాజా నిబంధనల్లో.. విధి నిర్వహణలో విఫలమైన, నిధుల దుర్వినియోగం విషయంలో సర్పంచ్‌లను తొలగించేలా నిబంధనలు చేర్చారు. ఉప సర్పంచులు దీనిని ఆసరాగా చేసుకుని సర్పంచ్‌లను తొలగించేలా ప్రయత్నాలు చేయవచ్చనే అభిప్రాయమూ వస్తోంది.

తాగునీటితో స్నానం చేస్తే రూ.500 జరిమానా
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి, మెరుగైన పరిపాలన దిశగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో చాలా అంశాలను చేర్చారు. నీటి వృధాను అరికట్టడం, అక్రమ నిర్మాణాల నియంత్రణ, అల్లర్ల నిరోధం, పారిశుధ్య అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.

తాగునీటిని స్నానానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.500 జరిమానా వేయాలని చట్టంలో పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థతో సరఫరా చేసే నీటిని వృథా చేయడం, స్నానానికి వినియోగించడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, వాహనాలను శుభ్రపరచడం వంటి చర్యలకు పాల్పడితే ఈ జరిమానా విధిస్తారు.

బహిరంగ ప్రదేశాల్లో అల్లరి (నూసెన్స్‌) చేసిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుంది.

లైసెన్సు లేకుండా రోడ్డు దగ్గరలో ఇసుక తీసినా, రోడ్డు తవ్వినా రూ.ఐదు వేల జరిమానా వసూలు చేస్తారు.

అనుమతి లేకుండా చెట్లను నరికినా, బహిరంగంగా గొర్రెలు, మేకలు, పశువులను వధించడం చేసినా.. నాలాపై అక్రమంగా భవనాన్ని నిర్మించినా రూ. రెండు వేల అపరాధ రుసుము విధిస్తారు.

నిషేధిత ప్రాంతంలో చెత్తను కాల్చడం, పారవేయడం, రోడ్డును ఆక్రమించి గోడను నిర్మించడం, ఇనుప కంచె ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘలనకు రూ.వెయ్యి జరిమానా ఉంటుంది.

ఇళ్ల లేఔట్లకు ఆన్‌లైన్‌ అనుమతులు
గ్రామాల్లో ఇళ్ల లేఔట్ల అనుమతుల జారీ కోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోంది. ఇళ్ల స్థలాల లేఔట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసిన వారంలోగా సాంకేతిక మంజూరు విభాగానికి పంపాలి. అలా పంపకపోయినా పంపినట్టే పరిగణిస్తారు. సాంకేతిక విభాగం అన్ని అంశాలను పరిశీలించి 30 రోజుల్లోగా పంచాయతీకి వివరణ ఇవ్వాలి. అనంతరం ఏడు రోజుల్లోగా లేఔట్‌ యజమానికి గ్రామ పంచాయతీ సమాచారం ఇవ్వాలి. 300 చదరపు గజాల్లో 10 మీటర్ల ఎత్తుకు మించని జీ ప్లస్‌ టు భవనాల నిర్మాణానికి పంచాయతీలు అనుమతి ఇస్తాయి. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే అనుమతి లభించినట్లుగా భావించాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు