రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారు.. 

24 Jul, 2019 02:13 IST|Sakshi

ఈఎస్‌ఐ కుంభకోణంలో కొత్త కోణం 

ఆధారాల తారుమారుకు యత్నం 

శశాంక్‌ గోయల్, దేవికా రాణిలపై సంచలన ఆరోపణలు  

మీడియాకు లేఖలు రాసిన ఓ యూనియన్‌ నేత  

సాక్షి, హైదరాబాద్‌: మందుల కొనుగోలులో భారీ అవకతవకలు జరగడం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. రూ.300 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో ముఖ్య పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్, ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికా రాణిలపై సంచలన ఆరోపణలు చేస్తూ బి.గురవయ్య అనే యూనియన్‌ నేత పేరిట మంగళవారం పత్రికా కార్యాలయాలకు బహిరంగ లేఖలు వచ్చాయి. ఈ లేఖలో పేర్కొన్న మేరకు శశాంక్‌ గోయల్, దేవికా రాణి, నాగలక్ష్మిలు కలిసి శనివారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు సనత్‌నగర్‌లోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్స్‌లో సీడీఎస్‌ సెక్షన్‌కు వెళ్లి రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు.

వారు ఆధారాలు తారుమారు చేసేందుకు అక్కడకు వెళ్లడం నిజమో కాదో అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే తేలుతుందని ఆ లేఖలో వెల్లడించారు. మొదటి నుంచీ నాన్‌ఆర్‌సీ కంపెనీలను బినామీలుగా ఏర్పాటు చేసి దాదాపు 40కి పైగా కంపెనీల్లో అడ్డగోలుగా చెల్లింపులు చేసుకున్నారని తెలిపారు. విజిలెన్స్‌ నివేదికలో ఉన్న కంపెనీల పేర్లను పరిశీలించి నాన్‌ ఆర్‌సీ కంపెనీల లిస్టులో ఉన్న ఎన్ని కంపెనీలకు రెండేళ్లుగా డబ్బులు పంపారో పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. నాన్‌ ఆర్‌సీ కంపెనీలను బినామీలుగా సృష్టించినట్లు విజిలెన్స్‌ నివేదిక చెబుతుంటే ఆర్‌సీ కంపెనీల వైపు ఏసీబీ అధికారుల దృష్టి మరల్చే విధంగా తప్పుడు లేఖలు రాసి ఏసీబీని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.  

రూ.కోట్లలో ముడుపులు.. 
ప్రధాన సూత్రధారులకు బినామీగా వ్యవహరించిన సుధాకర్‌రెడ్డి పేరిట చాలా ఫర్మ్‌లున్నాయని, గత రెండేళ్లలో సుధాకర్‌రెడ్డి మొబైల్‌ ఫోన్‌ నుంచి శశాంక్‌ గోయల్, దేవికా రాణిలకు వచ్చిన ఫోన్‌ కాల్స్‌ను పరిశీలిస్తే వీరి అక్రమాలు బయటపడుతాయని ఆ లేఖలో గురవయ్య వెల్లడించారు. సచివాలయం వేదికగానే సుధాకర్‌రెడ్డి, కమల్‌ అనే వ్యక్తుల నుంచి శశాంక్‌ గోయల్‌ రూ.కోట్లలో ముడుపులు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో కార్మిక శాఖ కార్మికుల యూనియన్‌ కార్యదర్శి పేరుతో పత్రికా కార్యాలయాలకు వచ్చిన లేఖలో పేర్కొన్న అంశాలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి.   

>
మరిన్ని వార్తలు