ఉపకారం... ‘సెట్‌’ చేశారు! 

14 Jan, 2019 01:13 IST|Sakshi

త్వరలో స్కాలర్‌షిప్, ఫీజు దరఖాస్తులో కొత్త విధానం

దోస్త్, సెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ నమోదు చేసిన వెంటనే వివరాలు ప్రత్యక్షం  

సాక్షి, హైదరాబాద్‌: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తోంది. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకుగాను విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలా దరఖాస్తు చేసే క్రమంలో వారి వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాల్సి వస్తోంది. కోర్సు చదివినన్ని సంవత్సరాలు ఇలా ప్రతిసారీ వివరాల నమోదు ఇబ్బందికరంగా మారుతోంది. పైగా నమోదు క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే వారి ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర జాప్యం జరుగుతుంది.

ఈక్రమంలో దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎస్సీ అభివృద్ధిశాఖ కసరత్తు చేస్తోంది. ఇకపై సెట్‌ (కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఆధారంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. దరఖాస్తు చేసే ప్రక్రియలో కేవలం సెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ నమోదు చేసిన వెంటనే విద్యార్థి వివరాలు పేజీలో ప్రత్యక్షమవుతాయి. ఇందులో కోర్సు, కాలేజీ తదితర వివరాలను ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేసిన వెంటనే దరఖాస్తు కాలేజీ యూజర్‌ ఐడీకి చేరుతుంది.  

అన్ని డిగ్రీ, పీజీ కోర్సులకు.. 
ఇంటర్మీడియెట్‌ మినహాయిస్తే డిగ్రీ విద్యార్థులకు దోస్త్, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సెట్‌కు దరఖాస్తు చేసుకున్న వివరాలను ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు ఫారంలో ప్రత్యక్షమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు దోస్త్, సెట్‌ల వెబ్‌సైట్‌లను ఈపాస్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఈమేరకు సీజీజీ(సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌) అధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ సంప్రదింపులు చేస్తోంది.

ఈపాస్‌ వెబ్‌సైట్‌తో వివిధ సెట్ల వెబ్‌పేజీలను అనుసంధానం చేస్తే సర్వర్, సాంకేతికత సమస్యలు కూడా తీరుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చించిన అధికారులు వచ్చే విద్యా ఏడాది నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ సాక్షితో అన్నారు.  

మరిన్ని వార్తలు