బిల్లు కట్టాకే కరెంటు!

1 May, 2016 17:47 IST|Sakshi
బిల్లు కట్టాకే కరెంటు!

ప్రీపెయిడ్ ‘స్మార్ట్’ మీటర్లు అమర్చేందుకు సిద్ధమైన డిస్కంలు
మీటర్లలో సిమ్‌కార్డు.. నేరుగా ‘విద్యుత్’ రీచార్జి
భారం వినియోగదారులపైనే.. వాయిదాల్లో వసూలు?

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీపెయిడ్ ‘స్మార్ట్’ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇకపై ప్రతి నెలా ముందు(అడ్వాన్స్)గా బిల్లు చెల్లిస్తేనే, అదీ బిల్లు చెల్లించిన మేరకే విద్యుత్ సరఫరా చేసే విధానం రాబోతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 48 వేల పైచిలుకు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ‘స్మార్ట్’ మీటర్లను బిగించనున్నారు. భవిష్యత్తులో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు సైతం దీనిని వర్తింపజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

 నాలుగు కంపెనీలతో..
ఈ స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణకు సం బంధించి డిస్కంలు తాజాగా 4 ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌తో పాటు జైపూర్‌కు చెందిన జీనస్, గురుగ్రామ్‌కు చెందిన హెచ్‌పీఎల్, బెంగళూరుకు చెందిన ‘పవర్ వన్ డేటా’ కంపెనీల నుంచి ఆటోమేటిక్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లతో పాటు నిర్వహణ సేవల కోసం ఒప్పందా లు ఖరారయ్యాయి. సింగిల్ ఫేజ్ మీటర్‌ను సుమారు రూ.7వేలు, త్రీఫేజ్ మీటర్‌ను రూ.8 వేలకు కొనుగోలు చేస్తున్నామని అధికారవర్గాలు తెలిపాయి.

ఈ ఒప్పందం మేరకు జూన్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాల యాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. లో టెన్షన్ (ఎల్టీ) సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ కేటగిరీల్లోని కార్యాలయాలకు మాత్రమే వీటిని అమరుస్తా రు. ఆ తర్వాత హైటెన్షన్(హెచ్‌టీ) విభాగంలోని కార్యాలయాలకు విస్తరింపజేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కం యోజన(ఉదయ్) పథకంలో రాష్ట్రం చేరితే.. గృహ, వాణిజ్య, పరిశ్రమలు తదితర అన్ని రంగాల వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాల్సి ఉంటుంది.

 మీటర్‌లో సిమ్‌కార్డు
ఇప్పటివరకు ఎక్కడా వినియోగించని సరి కొత్త ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించనున్నామని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్‌లో ‘కీ ప్యాడ్’తో పనిచేసే ప్రీపెయిడ్ మీటర్లను వినియోగించడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. రహస్య కోడ్ ఆధారంగా ప్రీపెయిడ్ సిమ్‌కార్డును రీచార్జి చేసినట్లే... ఈ విద్యుత్ మీటర్లను రీచార్జి చేయాలి. రహస్య కోడ్‌లు దుర్వినియోగమైతే నష్టాలు వస్తాయని భావించిన డిస్కంలు...  కీప్యాడ్ మీటర్ల పట్ల విముఖత చూపాయి.

ఆ మీటర్లను తక్కువ ధరకే సరఫరా చేస్తామని పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు దాఖలు చేసిన టెండర్ బిడ్లను తిరస్కరించి... బిల్లు చెల్లించిన వెంటనే ఆటోమెటిగ్గా రీచార్జయ్యే మీటర్లను మాత్రమే ఎంపిక చేశాయి. ఈ మీటర్లలో ఒక సిమ్‌కార్డు/డాటా కార్డు ఉంటుంది. భవనానికి ఒకే మీటర్ ఉంటే సిమ్‌కార్డుతో, ఒకటికి మించిన సంఖ్యలో ఉంటే ఇంటర్నెట్ డాటా కార్డుతో వాటిని అనుసంధానం చేసి ఆపరేట్ చేస్తారు. బిల్లు చెల్లించిన వెంటనే ఆ మేరకు విద్యుత్ వినియోగించుకునేందుకు అనుమతిస్తూ సిమ్‌కార్డుకు సమాచారం చేరుతుంది. సిమ్‌కార్డు నెల అద్దె రూ.19. అయితే నిర్వహణ వ్యయం కింద ఈ మొత్తాన్ని మీటర్ల కంపెనీలు భరించనున్నాయి.

 మరెన్నో ప్రయోజనాలు కూడా..
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఏ ఇంట్లో/ఆఫీసులో కరెంటు ఉంది, ఎక్కడెక్కడ విద్యుత్ సరఫరా లేదన్న సమాచారం డిస్కంలకు వెంటనే తెలిసిపోతుంది. సాంకేతిక సమస్యలతో సరఫరా నిలిచిపోతే... వినియోగదారులు ఫిర్యాదు చేయకపోయినా డిస్కంలు స్పందించి సరఫరాను పునరుద్ధరించే వెసులుబాటు కలుగుతుంది. ఏ వినియోగదారుడు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాడో తెలుస్తుం ది. తద్వారా విద్యుత్ డిమాండ్‌ను కచ్చితంగా అంచనా వేయవచ్చు.

 బిల్లు కట్టకపోతే అంతే..
ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల మొండి బకాయిలు రూ.2,020 కోట్లదాకా పేరుకుపోయాయి. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను అమర్చాలని సీఎం కేసీఆర్ నాలుగు నెలల కింద డిస్కంలను ఆదేశించారు. ఈ మీటర్లను బిగించిన తర్వాత అడ్వాన్స్‌గా బిల్లులు చెల్లించకపోతే సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.

అయితే అత్యవసర సమయాల్లో ప్రీపెయిడ్ మీటర్‌పై ఉండే ఒక ప్రత్యేక బటన్‌ను నొక్కితే మరో 24 గంటల పాటు పూర్తి విద్యుత్ సరఫరా ఉంటుంది. అప్పటికీ బిల్లు చెల్లించకపోయినా మరో 72 గంటల పాటు 20శాతం విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంది. అంటే ఏసీల వంటి ఉపకరణాలను వినియోగించుకోలేరు. ఆ తర్వాత విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ప్రీపెయిడ్ మీటర్ల వ్యయాన్ని సంబంధిత వినియోగదారుల నుంచే వసూలు చేయాలని డిస్కంలు భావిస్తున్నాయి. వాయిదాలుగా వసూలు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు