‘స్వగృహా’లకు కొత్త ధరలు

11 Mar, 2014 00:47 IST|Sakshi

బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్ ప్రాజెక్టులకు భారీగా తగ్గింపు
 సాక్షి, హైదరాబాద్: స్వగృహ ఇళ్ల ధరలను భారీగా తగ్గించి విక్రయించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. నగరంలోని బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్‌లలోని ఇళ్లకు కొత్త ధరలు ప్రతిపాదిస్తూ వివరాలను ప్రభుత్వానికి పంపింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఫైలు ను పంపినప్పటికీ, అదే సమయంలో ఆయన రాజీనామా చేయటంతో దానిపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో అదే ప్రతిపాదనను ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా 21చోట్ల స్వగృహ ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ.. ప్రధాన నిర్మాణాలు పూర్తిస్థాయిలో సిద్ధమైంది ఈ మూడు చోట్లనే. వీటిల్లోనూ బండ్లగూడలో మాత్రమే కొంతవరకు మౌలిక వసతులు ఏర్పాటయ్యాయి.
 
 అందులో 600 ఇళ్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. బండ్లగూడ ప్రాజెక్టు లో గత డిసెంబర్ వరకు చదరపు అడుగు ధర రూ.2,350, పోచారంలో రూ.2,250, జవహర్‌నగర్‌లో రూ.2,000గా ఉండేది. కానీ, అప్పు తాలూకు వడ్డీని లెక్కిస్తే నష్టాలొస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం గత డిసెంబర్‌లో వీటి ధరలను భారీగా పెంచేసింది. బండ్లగూడలో ధరను రూ.2,950, పోచారం ధరను రూ.2,850 పేర్కొంటూ ప్రతికల్లో ప్రకటనలిచ్చింది. అసలే ఇళ్ల అమ్మకాలు జరగకుండా ఉన్న తరుణంలో ధరలను భారీగా పెంచటంతో ఒక్క ఇల్లు కూడా అమ్ముడవలేదు. దీంతో ధరలను తగ్గిస్తే తప్ప ఇళ్ల అమ్మకాలు సాధ్యం కాదని పేర్కొంటూ అధికారులు కొత్త ధరలను ప్రతిపాదించారు. దీని ప్రకారం బండ్లగూడలో చ.అ. ధరను రూ.2,000 పోచారంలో రూ.1,800, జవహర్ నగర్‌లో రూ.1,600గా పేర్కొం టూ ప్రతిపాదనలు పంపారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ తతంగం పూర్తి అయ్యే లోపే వీలైనన్ని ఇళ్లను అమ్మి వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాలన్న ఆలోచనలో అధికారులున్నారు.

మరిన్ని వార్తలు