షాపులకు క్యూఆర్‌...ఇది కొత్తది యార్‌!

13 Dec, 2019 01:41 IST|Sakshi

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారులు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే సర్కిల్‌ పరిధిలోని జనప్రియ ప్రాంతంలో క్యూఆర్‌ కోడ్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా కమర్షియల్‌ ప్రాంతాల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఉప కమిషనర్‌ ప్రదీప్‌కుమార్, శానిటరీ సూపర్‌వైజర్లు ఆంజనేయులు, కృష్ణ కిశోర్‌ ఆధ్వర్యంలో హైదర్‌గూడ, అత్తాపూర్‌లోని దుకాణాలను సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రతి దుకాణానికి ఒక కోడ్‌ను కేటాయిస్తున్నారు. తడి, పొడి చెత్తగా వేరు చేసి అందించాలని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇక చెత్త సేకరణకు వచ్చే సిబ్బంది తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కోడ్‌ను స్కాన్‌ చేసి చెత్తను సేకరించనున్నారు.

అదేవిధంగా కోడ్‌ ఆధారంగా సిబ్బంది పని తీరును సైతం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నా రు. హైదర్‌గూడ, అత్తాపూర్‌ ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు చెత్తను రోడ్లపై వేయకుండా ఏర్పాట్లు చేశారు. తడి, పొడి చెత్త కోసం డబ్బాలను సైతం అందజేశారు. క్యూఆర్‌ కోడ్‌తో మరింత పకడడడడ్బందీగా ప్రతి దుకాణం నుంచి చెత్తను సేకరించడం సులభతరం కానుంది.  – రాజేంద్రనగర్‌

హైదర్‌గూడ అపార్ట్‌మెంట్‌లో తొలిసారిగా
గత మార్చి 28న జీహెచ్‌ఎంసీ యంత్రాంగం 1,200 కుటుంబాలు ఉంటున్న హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో దేశంలోనే తొలిసారి క్యూఆర్‌ కోడ్‌తో చెత్త సేకరణను ప్రారంభించింది. మొదట కొంతమేర ఇబ్బందులు ఎదురైనా అనంతరం పూర్తిస్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో వ్యాపార ప్రాంతాల్లో అమలు చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నివాస ప్రాంతాల నుంచీ క్యూఆర్‌ కోడ్‌తో చెత్త సేకరిస్తున్నారు.

త్వరలో ప్రారంభానికి సన్నాహాలు.. 
అత్తాపూర్, హైదర్‌గూడ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. ఇవి రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో అతిపెద్ద వ్యాపార కేంద్రాలు. దీంతో ఈ ప్రాంతంలో నూరు శాతం చెత్తను సేకరించేందుకు అధికారులు క్యూఆర్‌ కోడ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు త్వరలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను ఆహ్వానించేందుకు అధికారులు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు