సికింద్రాబాద్ టు కరీంనగర్

10 Jun, 2014 02:07 IST|Sakshi
సికింద్రాబాద్ టు కరీంనగర్

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి కరీంనగర్‌కు సిద్దిపేట మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం ఈ లైన్ కోసం కేంద్రమంత్రి హోదాలో కె.చంద్రశేఖర్‌రావు రైల్వే శాఖను కోరారు. ఆయన ఒత్తిడితో అప్పట్లో అధికారులు కూడా దానిపై దృష్టి సారించారు. కానీ ఆ తర్వాత ఈ ప్రతిపాదన అటకెక్కింది. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దీనిపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం తరఫున అందజేసే ప్రతిపాదనల్లో దీన్ని మొదటి అంశంగా పేర్కొనబోతున్నారు. తెలంగాణలో రాజధాని నగరంతో రైల్వే అనుసంధానం లేని కీలక పట్టణం కరీంనగరే. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు సిద్దిపేట మీదుగా ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
 
 రైల్వే లైన్ లేకపోవటంతో అంతా రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్-కరీంనగర్ మధ్య నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యే దాదాపు  20 వేల వరకు ఉంది. ఇతర వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య దాదాపు ఇంతే ఉంటుందని సమాచారం. ఆర్టీసీ నిత్యం 200 ట్రిప్పులేయాల్సి వస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న రాజీవ్ హైవే కిక్కిరిసిపోయి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రైల్వే లైన్‌పై ఎప్పటికప్పుడు డిమాండ్ వస్తున్నా రైల్వే శాఖ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా 2011-12 బడ్జెట్‌లో ఈ లైన్ ప్రస్తావన తెచ్చారు. సర్వే చేసే కొత్త లైన్ల జాబితాలో దీన్ని చేర్చారు. కానీ నిధులు మాత్రం కేటాయించకపోవటంతో ప్రస్తుతం అది పెండింగ్ పనుల జాబితాలో కూడా లేదు.
 
 మనోహరాబాద్ స్టేషన్‌తో అనుసంధానం...
 
 ఈ రైలుమార్గాన్ని పెద్దపల్లి-మనోహరాబాద్‌గా పేర్కొంటూ త్వరలో రాష్ట్రప్రభుత్వం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ శివారు ప్రాంతం రక్షణశాఖ (కంటోన్మెంట్) పరిధిలో ఉండటంతో అక్కడ రైల్వే లైన్ నిర్మాణం దాదాపు అసాధ్యం. ఇదే కారణంతో గతంలో రైల్వే శాఖ దీన్ని పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఘట్కేసర్ గాని భువనగిరితోగాని అనుసంధానం చేయాలనే ఆలోచనలూ వచ్చాయి. అయితే సిద్దిపేట మీదుగా నిర్మితం అవుతూ నేరుగా సికింద్రాబాద్‌కు చేరేలా ఉండాలంటే నగర శివారు వరకు కొత్త లైన్ నిర్మించి అక్కడి నుంచి మేడ్చల్ మీదుగా మనోహరాబాద్ స్టేషన్ వద్ద ప్రస్తుతం ఉన్న లైన్‌తో అనుసంధానించాలని ప్రతిపాదనలో పేర్కొననున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరలోనే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అప్పటికల్లా ప్రతిపాదనలు పూర్తి చేసి ఈ బడ్జెట్‌లోనే సర్వేకు నిధులు ప్రకటించేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.
 
 త్వరలో కేసీఆర్‌తో భేటీ : ఎంపీ వినోద్‌కుమార్
 
 ‘‘పెద్దపల్లి-మనోహరాబాద్-సికింద్రాబాద్ రైల్వే లైన్ నిర్మాణం అవశ్యం. ప్రజల దశాబ్దాల కల త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నాం. దీనిపై ఈ వారంపది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, రాష్ట్రప్రభుత్వం తరఫున అధికారికంగా పంపుతాం. దాని ఆధారంగా మేం ఢిల్లీలో రైల్వేశాఖపై ఒత్తిడి చేస్తాం’’

మరిన్ని వార్తలు