కూత కూయదు.. ఆశ తీరదు!  

8 Feb, 2019 08:04 IST|Sakshi

వనపర్తి టౌన్‌: మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు మోక్షం కలగలేదు. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. కేంద్రం ఈ ఏడాది కూడా నిరాశే మిగిల్చింది. గద్వాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచర్ల రైల్వేలైన్‌ నిర్మాణం కోసం నిధులు మంజూరు అవుతాయని అందరూ భావించినా.. మరోసారి మొండిచేయి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఒప్పందం చేసుకోలేకపోవడంతోనే బడ్జెట్‌లో ఈ లైన్‌కు నిధులు మంజూరు కాలేదని తెలుస్తోంది.

జోగుళాంబ గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కల్వకుర్తి, అచ్చంపేట గుండా మాచర్లకు నేరుగా వెళ్లాలనే ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. నిధులు విడుదలపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలుగా మారాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో సగం వాటా భరించాల్సిన ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోకపోవడమే అసలు సమస్యగా మారిందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య చెబుతున్నారు.

1980లో ప్రతిపాదనలు.. 
నాగర్‌కర్నూల్‌ జిల్లా మీదుగా ప్రతిపాదించిన గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌  వేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత అది మరుగున పడిపోయింది. 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి డీటైల్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌(డీపీఆర్‌) తయారు చేసి కేంద్రానికి ఇచ్చారు. దీంతో 2015లో కేంద్రం కంటితుడుపు చర్యగా కేవలం నల్లగొండ– మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20కోట్లు మంజూరు చేసింది. ఇది మినహా ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న చొరవ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పైనే ఈ అంశం ఆధారపడి ఉందనేది అందరి వాదన. రైల్వేలైన్‌ కోసం అయ్యే ఖర్చులో 50శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూసేకరణ, ఇతర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

మొదటి దశకు 2002లో శంకుస్థాపన 
ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా 2000ఏడాది నుంచి బడ్జెట్‌లో రైల్వే లైన్‌ మంజూరు అంశం రాజకీయ నాయకులంతా చర్చకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఎన్నో ఆశలు రేకెత్తించింది. ఆ తర్వాత సర్వే చేయడంలోనే తీవ్ర ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు కొన్నేళ్ల కిందట సర్వే కొలిక్కి రావడం ఊరటనిచ్చింది. 2002లో కేంద్ర రైల్వే సహాయ మంత్రి హోదాలో బండారు దత్తాత్రేయ రాయచూర్‌ – గద్వాల రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల క్రితం డెమో పూర్తి చేసుకొని రాకపోకలు సైతం ప్రారంభమయ్యాయి. రెండో దఫా పనులకు భారీ వ్యయం అవుతుందని తర్జనభర్జన పడిన రైల్వేశాఖ చివరకు అంగీకారం తెలపడంతో ఆశలు రెకేత్తాయి.

గద్వాల–మాచర్ల మధ్య 151–154 కిలోమీటర్ల రైల్వే లైన్‌కు కోసం రూ.1,160 కోట్లు అవసరం అవుతాయని రైల్వేశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకు నీతి అయోగ్‌ సైతం ఆమోదముద్ర వేసింది. తద్వార గద్వాల నుంచి వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీదుగా మాచర్ల చేరుకోవచ్చు. దీంతో వ్యాపార, వాణిజ్యం పెరగడంతో పాటుగా పరి«శ్రమలు తరలివస్తాయి. సగం వాటా భరిస్తే కొత్త లైన్లు వేస్తామని కేంద్రం విధించిన నిబంధన మేరకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ.కోట్లు ఖర్చు అవుతుందనేమో తెలియదు గానీ ఖర్చులో చెరి సగం వాటా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవడంతోనే ఆలస్యం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కలిసి ఈ ఒప్పందం చేసుకోవాలి. కానీ రెండేళ్లు గడిచినా ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో ఒప్పందం చేసుకుంటారా? లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతోంది.

ఎప్పటి నుంచో మూడు రాష్ట్రాల మార్గం 
జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల ప్రజలకు అన్ని విధాలుగా మేలు కలగడంతో పాటుగా రవాణా చౌకగా అందుబాటులోకి వస్తోందని, ఈ ప్రాంతాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయని 30 ఏళ్లుగా రైలు కూత వినేందుకు తహతహలాడుతున్నారు. అప్పుడు, ఇప్పుడు అంటూ చెప్పుకొస్తున్న నేతలు మాత్రం రైల్వే లైన్‌ రాజకీయానికి వాడుతున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ రైల్వేలైన్‌ మార్గం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల గుండా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలను కలిపే రైలు మార్గమైన రాయచూర్‌–మాచర్ల లైన్‌ ఏర్పాటుపై ఇక్కడి ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రవాణాపరంగా ఎంతో సౌకర్యవంతమైన ఈ రైలు  మార్గంతో వ్యాపార, వాణిజ్యపరంగా ఈ ప్రాంత ప్రజలకు మేలు కలగనుంది. దీనికి తోడు మూడు రాష్ట్రాలకు రాకపోకలు మెరుగుపడతాయి. వ్యాపారుల, ప్రయాణికులకు ఇబ్బందులు తీరుతాయి. దక్షిణ మధ్య రైల్వే కర్ణాటక, ఆంధ్ర, కోస్తా ప్రాంతాలను తెలంగాణ మీదుగా కలిపేందుకు ఈ రైల్వే మార్గాన్ని ప్రతిపాదించి సర్వేను సైతం పూర్తి చేశారు. ఇందులో కర్ణాటక నుంచి తెలంగాణలోని గద్వాల వరకు రెండేళ్ల కిందట మొదటి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశ పనులపై రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధమైతే కేంద్రం పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే..  
గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌ కోసం ఏ ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవతీసుకుంటే మన కల ఫలించే అవకాశం ఉంది. ఈ రైల్వే లైన్‌కోసం అయ్యే ఖర్చులో 50శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. రైల్వే లైన్‌ వచ్చేది లేనిది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది.  – సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా చైర్మన్‌ , నాగర్‌కర్నూల్‌

తాతల కాలం నాటి డిమాండ్‌  
గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌ చేపట్టాలనే కోరిక తాతల కాలం నాటి డిమాండ్‌. ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వస్తుందని అందరూ ఆశించాం. ఈ ఏడాదైనా రైల్వే మార్గం వచ్చేలా పాలకులు కృషి చేయాలి. రైలు మార్గం రాకతో ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. – బలరాం మూర్తి, వనపర్తి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు