ఊరట

24 Feb, 2018 07:30 IST|Sakshi

20వేల మందికి అందనున్న రేషన్‌ కార్డులు

కొత్త కార్డుల జారీకి సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనకు మార్గం సుగమం

తాజా అర్జీలపై స్పష్టతనివ్వని ప్రభుత్వం

సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏడాదికాలంగా ఎదురు చూస్తున్న ఆహారభద్రతా కార్డులను పరిశీలించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 20,787 మందికి ఊరట కలుగనుంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:   ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఈ–పాస్‌ పద్ధతి ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో అవరోధాలు రాకుండా కొత్త రేషన్‌కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం తీసుకునే నాటికి అంటే 2017 మే నెల వరకు 20,787 దరఖాస్తులు మీ–సేవ ద్వారా యంత్రాంగానికి చేరాయి. అప్పటి నుంచి కార్డుల కోసం వేచిచూస్తున్న అర్జీదారులకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఆశలు రేకెత్తిస్తోంది. పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించి పక్షం రోజుల్లో ఆమోదముద్ర వేయాలని ఆదేశించింది. దరఖాస్తుదారు వ్యక్తిగత సమాచారం, బీపీఎల్‌ కుటుంబమా కాదా? ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా, వ్యవసాయ భూమి తదితర వివరాలతో కూడిన చెక్‌స్లిప్‌ను పంపింది.

దీనికి అనుగుణంగా ధ్రువీకరిస్తే కొత్త కార్డులను జారీచేయాలని నిర్దేశించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకే తెల్ల రేషన్‌కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఆరోగ్యశ్రీ, రెండు పడక గదుల ఇల్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాల అమలులో ఈ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్న కారణంగా ప్రతి వ్యక్తి ఆహారభద్రతాకార్డు కోసం దరఖాస్తు చేయడం అలవాటుగా మారింది. దీంతోనే ఇబ్బడిముబ్బడిగా అర్జీలు వచ్చాయని యంత్రాంగం అంటోంది. రేషన్‌కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయనే అభిప్రాయం తప్పని, కేవలం రేషన్‌ సరుకులు మాత్రమే ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసినా పెద్దగా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయని తెలుస్తోంది.

కొత్తవాటి సంగతేంటి?
గత ఏడాది మే వరకు పెండింగ్‌లో ఉన్న వాటికే మోక్షం కలిగించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత వచ్చిన సుమారు 10వేల దరఖాస్తులపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో ప్రజల్లో గందరగోళానికి తావిస్తోంది. పాత వాటిని పరిశీలించి.. కొత్త అర్జీలను పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులకు కూడా తలనొప్పిగా మారే అవకాశంలేకపోలేదు. యంత్రాంగం మాత్రం తొలుత పాత దరఖాస్తులను పరిష్కరించి.. ఆ తర్వాత తాజాగా వచ్చేవాటిపై దృష్టిసారించే వీలుందని అంటోంది.

అర్హులకు ఆహారభద్రత
పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం. ఆన్‌లైన్‌లో నమోదైనవాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తాం. అర్జీదారుల సమాచారం సేకరించమని తహసీల్దార్లకు సూచనలు చేశాం. అక్కడి నుంచి రాగానే కార్డుల జారీకి చర్యలు తీసుకుంటాం.     –గౌరీశంకర్, డీఎస్‌ఓ

మరిన్ని వార్తలు