కొత్త రైతులకు నో చాన్స్‌

9 Oct, 2018 10:33 IST|Sakshi

‘రైతు బంధు’ అమలు విషయంలో ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుంది.ఈ పథకంలో కొత్త వారిని చేర్చకూడదని సూచనలు చేసింది. దీంతో భూ వివాదాలు పరిష్కారమై పార్ట్‌ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్‌ ‘ఎ’లోకి మారిన రైతులు, పలు కారణాల వల్ల ఖరీఫ్‌లో చెక్కులు పొందలేక పోయిన దాదాపు 60 వేల మందికి పైగా  రైతులకు నిరాశే ఎదురు కానుంది.


మోర్తాడ్‌(బాల్కొండ): పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో కొత్త వారిని చేర్చకూడదని ఎన్నికల కమిషన్‌ సూచించడంతో గతంలో చెక్కులు పొందిన రైతులకే ప్రయోజనం చేకూరనుంది. పార్ట్‌ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్‌ ‘ఎ’ పరిధిలోకి మారిన రైతులు, వివిధ కారణాల వల్ల ఖరీఫ్‌లో చెక్కులు పొం దలేక పోయిన రైతులకు నిరాశే ఎదురుకానుంది. అయితే రబీ సీజనుకు సంబంధించి పెట్టుబడి సహాయం అందించడానికి తమకు ఇంకా మార్గదర్శకాలు అందలేదని అందువల్ల ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు 
చెబుతున్నారు.

రైతుబంధు పథకం కింద ఎకరానికి ఖరీఫ్‌కు రూ.4 వేల చొప్పున, రబీ సీజనుకు మరో రూ.4 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం విదితమే. ఖరీఫ్‌ సీజనుకు గాను మే నెలలోనే అర్హులైన రైతులకు పెట్టుబడి సహాయం చెక్కులను వ్యవసాయ శాఖ అందించింది. రబీ సీజనుకు సంబంధించి నవంబర్‌లో చెక్కులను అందించాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ అమలైతే పెట్టుబడి సహాయానికి బ్రేక్‌ పడవచ్చని భావించిన ప్రభుత్వం ఒక నెల ముందుగానే పంపిణీకి ఏర్పా ట్లు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం  సోమవారం నుంచే అన్ని గ్రామాలలో పెట్టుబడి సహాయం చెక్కులను అందించాల్సి ఉంది.

కేంద్ర ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని పలు సూచనలు, సలహాలను అందించడంతో రైతుబంధు పథకం అమలులో ఊహించని మా ర్పులు చోటు చేసుకున్నాయి. గ్రామాలలో గ్రామసభలను నిర్వహించి చెక్కులను పంపిణీ చేయ కుండా రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సహాయం నగదు రూపంలో బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. అంతేగాక గతంలో పెట్టుబడి సహాయం పొందిన రైతులకు మాత్రమే రబీ సహాయంను అందించాలని కొత్త వారిని ఇప్పట్లో చేర్చవద్దని కూడా ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. దీంతో జిల్లాలో వివాదాస్పద భూములు పరిష్కారమై పార్ట్‌ ‘బి’ పరిధిలో నుంచి పార్ట్‌ ‘ఎ’ పరిధిలోకి మారిన రైతులు దాదాపు 30 వేల మంది పెట్టుబడి సహాయం అందుకోలేక పోతున్నారు.
 
ఖరీఫ్‌ సీజనులో జిల్లాలోని 2లక్షల, 271 మంది రైతులకు పెట్టుబడి సహాయం మంజూరు అయ్యింది. రూ.204.44 కోట్ల నిధులు ఇందు కోసం కేటాయించారు. రైతులు మరణించడం, ప్రభుత్వ భూముల్లో సాగు, ఆధార్‌ కార్డు అందించకపోవడం వంటి కారణాలతో 36,903 మంది రైతులకు చెక్కులు పంపిణీ కాలేదు. ఈ చెక్కులు వ్యవసాయ శాఖ వద్దనే ఉండిపోయాయి. వీరు కూడా రబీలో పెట్టుబడి సహాయం పొందలేకపోతున్నారు. అయితే విదేశాల్లో ఉన్న రైతుల పేరిట మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నికల కోడ్‌ అమలుకు ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడంతో విదేశాల్లో ఉన్న రైతుల చెక్కులకు కోడ్‌ వర్తించదని ప్రభుత్వం చెబుతోంది.

ఖరీఫ్‌ సీజనులో ఎంత మంది రైతులకు పెట్టుబడి సహాయం మంజూరైందో అంతే మొత్తం రబీ సీజనుకు కూడా మంజూరు కానుంది. ఇదిలా ఉండగా రైతుల ఖాతా నంబర్లను మళ్లీ సేకరించడమా లేక ధరణి వెబ్‌సైట్‌ ఆధారంగా నమోదైన ఖాతాల వివరాల ప్రకారం నగదు బదిలీ చేయడమా అనేది ప్రభు త్వం తేల్చాల్సి ఉంది. ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం నడుచుకుంటామని వ్యవసాయ శాఖ చెబుతుండగా ఇందు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాలు జారీ అయితేనే రబీ సీజను పెట్టుబడి సహాయం ఎలా అందుతుందో స్పష్టం అవుతుంది. ఇందుకోసం కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

నగదు బదిలీపై రైతుల్లో అసంతృప్తి 
రబీ సీజను పెట్టుబడి సహాయాన్ని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల బ్యాంకర్లు పాత రుణాల వసూలుకు లింకు పెట్టి పెట్టుబడి సహాయం చెల్లించకుండా నిలిపివేస్తారని రైతులు అంటున్నారు. చెక్కులు ఇవ్వడం వల్ల తమకు అవకాశం ఉన్న బ్యాంకులో నగదును విత్‌ డ్రా చేసుకోవడానికి వీలు ఉండేది. బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం వల్ల పాత రుణాలకు బ్యాంకర్లు లంకె పెట్టే అవకాశం ఉండటంతో రైతులు ఈ విధానంపై పెదవివిరుస్తున్నారు. కాగా బ్యాంకర్లకు పెట్టుబడి సహాయం చెల్లింపులపై ఆదేశాలు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు.

తప్పులు వచ్చాయని చెక్కులు ఇవ్వలేదు 
మేము గతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి సంబంధించి మూడు ఎకరాలకు బదులు ఎక్కువ భూమి మా రికార్డులలో నమోదు అయ్యింది. దీంతో రూ.12 వేల పెట్టుబడి సహాయానికి బదులు ఎక్కువ సొమ్ము మంజూరైంది. అయితే అధికారులు అసలు ఉన్న భూమికి కూడా చెక్కు ఇవ్వలేదు. చెక్కును వాప సు తీసుకున్నారు. ఇంత వరకు మళ్లీ చెక్కు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు రూ.12 వేల చెక్కు ఇస్తారా ఇవ్వరా అనేది అధికారులు తేల్చడం లేదు.    – బూత్‌పురం మహిపాల్, రైతు, మోర్తాడ్‌

బ్యాంకు ఖాతాలను సేకరించాలని ఆదేశించారు 
రైతుబంధు పథకాన్ని రబీ సీజనుకు అమలు చేయడానికి గాను రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించాలని సూచించారు. గతంలో పెట్టుబడి సహాయం పొందిన రైతులకే పెట్టుబడి సహాయం అందించనున్నారు. కొన్ని కారణాల వల్ల పెట్టుబడి సహాయం అందుకోని రైతులకు ఇప్పుడు సహాయం అందిస్తారా లేదో తెలియదు. ప్రస్తుతానికి సహాయం పొందిన రైతుల ఖాతాల వివరాలు సేకరిస్తున్నాం.    –పర్స లావణ్య, వ్యవసాయాధికారి, మోర్తాడ్‌  

మరిన్ని వార్తలు