గ్రామ కార్యదర్శులకు కొత్త బాధ్యతలు 

15 Mar, 2019 15:38 IST|Sakshi
వాగుఒడ్డు రామన్నపల్లి  గ్రామపంచాయతీ కార్యాలయం  

మరో 30 విధులను అప్పగించిన ప్రభుత్వం 

ఇప్పటికే 64 బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శులు

సాక్షి, ఇల్లందకుంట:  గ్రామపంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మరో 30 కొత్త బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే 6 బాధ్యతలను నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం మరో 30 అదనపు బాధ్యతలను వీరిపై పెట్టింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అసలే కొరతగా ఉన్నారు. ఒక్కో గ్రామ కార్యదర్శి రెండు మూడు గ్రామాలకు ఇన్‌చార్జీలుగా నెట్టుకొస్తున్నారు. ఆ బాధ్యతలనే మోయలేకుండా ఉన్న గ్రామ కార్యదర్శులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది.

ప్రతీ గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ కార్యదర్శుల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రకియ కూడా పూర్తయినా కొంతమంది ఎంపికలో తప్పులు దొర్లాయని కోర్టుకు వెళ్లడంతో గ్రామ కార్యదర్శుల నియామకానికి బ్రేక్‌ పడింది. 2018 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం కార్యదర్శి గ్రామంలో పాలన బాధ్యతలను చూసుకోవడంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని సూచించింది.

పంచాయతీల్లో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, నిర్వహణ, తాగునీరు, వీధిదీపాలు, రోడ్లు, డ్రెయినేజీలు మొక్కలు నాటడం, పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేయాలని కోరింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌–42, సెక్షన్‌–286, సెక్షన్‌–43 ప్రకారం అప్పగించిన అన్ని బాధ్యతలు విధులు నిర్వర్తించాలని తెలిపింది. సెక్షన్‌ 6(8) ప్రకారం పంచాయతీ ఎజెండా రూపకల్పన బాధ్యత కా>ర్యదర్శిదేనని గ్రామ పాలకవర్గం అమోదంతో వీటిని అమలు చేయాలని సూచించింది.

 
24 గంటల్లో అనుమతులు.. 
భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతి ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 7 రోజుల్లో అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. లేఅవుట్ల అనుమతితో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతీ లే అవుట్‌లో 15శాతం భూభాగాన్ని తనఖా చేయాలని కోరింది. గ్రామంలో తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు గ్రామస్తులకు సమాచారం అందించాలని సూచించింది. జనన, మరణాలతో పాటు వివాహా రిజిస్ట్రేషన్ల నిర్వహణ గ్రామ కార్యదర్శి చేయాల్సి ఉంటుంది.

 
ఇవీ మార్గదర్శకాలు 

  • కార్యదర్శి ప్రభుత్వానికి సబార్బినేట్‌గా వ్యవహరించాలి  
  • గ్రామసభకు ఎజెండా తయారు చేసి అందులోని అంశాలు సభ్యులందరికి తెలిసేలా ప్రచారం చేయాలి.  
  • ప్రతీ మూడు నెలలకొకసారి ఖర్చుకు సంబంధించి లెక్కలను పంచాయతీ అమోదానికి సమర్పించాలి.  
  • వరదలు, తుఫాన్‌లు, అగ్ని, రోడ్లు  ప్రమాదాలు సంభవించిన సందార్భాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలి.  
  • గ్రామంలో వ్యాధులు ప్రబలినప్పుడు అధికారులకు సమాచారమివ్వాలి.  
  • గ్రామాల్లోని అవసరాలను గుర్తించి గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారీలో పాలు పంచుకోవాలి. అలాగే ఎంపీపీ, ఎంపీడీవో, ఈవోపీఆర్‌డీ నిర్వహించే నెలవారి సమావేశాలకు హాజరు కావాలి.  
  • గ్రామసభలో లబ్ధిదారుల గుర్తింపు, వారికి రుణ పంపిణీ, రుణాల వసూళ్లకు సహకరించాలి.  
  • అంశాల వారీగా ఎజెండాలను సిద్ధం చేసి గ్రామపంచాయతీ అమోదం పొందాలి.  
  • ఎజెండాను ప్రదర్శించడం దండోరా వేయించడం, గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో నోటీసులను అంటించి ప్రజలకు సమాచార చేరేలా చూడటం.  
  • బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ వాడల్లో పర్యటించి ప్రభుత్వ పథకాల పంచాయతీ ఫలాలు అందేలా చూడాలి.  
  • వార్షిక పరిపాలన నివేదికను రూపొందించి గ్రామ పంచాయతీ అమోదం తీసుకోవడం.  
  • నెలవారీ సమీక్షలు, ప్రగతి నివేదికల రూపకల్పన ఉన్నతాధికారులకు నివేదికను అందించడం.  
  • మూడు నెలలకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ అమోదించడంతో పాటు ఈవోపీఆర్డీలకు సమాచారం ఇవ్వడం.  

సమస్యలతో బాధపడుతున్నాం  

మూడు నుంచి నాలుగేసి గ్రామాలకు ఇన్‌చార్జీలుగా పని చేయడం ద్వారా పనిభారం పెరుగుతోంది. వారంలో నాలుగు గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు రూపొందించాలంటే ఇబ్బందవుతుంది. జిల్లా కేంద్రాల్లో అనుకోకుండా నిర్వహించే మీటింగ్‌లకు హడావిడిగా వెళ్లాల్సి వస్తోంది.

– వాణి, కార్యదర్శి, శ్రీరాములపల్లి

పాలనాపరమైన బాధ్యత తప్పదు

కార్యదర్శులు తమ బాధ్యతలను నేరవేర్చాలి ఉంటుంది. పాలనపరమైన బాధ్యతలను చూసుకోవడంతో పాటు సర్పంచ్‌కు సబార్డినేట్‌గా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. త్వరలోనే కార్యదర్శుల నియామకం జరుగుతుంది.    

– జయశ్రీ, ఎంపీడీవో

మరిన్ని వార్తలు