బ్రెయిన్‌ ట్యూమర్ల చికిత్సలో కొత్త విప్లవం

22 Feb, 2018 00:54 IST|Sakshi
చికిత్స వివరాలు వెల్లడిస్తున్న యశోద ఆస్పత్రి వైద్య బృందం

     తొలి సర్జరీ సమయంలోనే పూర్తి కణాల తొలగింపు

     యశోదలో అత్యాధునిక ‘3టి ఎంఆర్‌ఐ’ చికిత్స

సాక్షి, హైదరాబాద్‌: మానవ శరీరంలోని అన్ని అవయవాలనూ నియంత్రించే శక్తి ఒక్క మెదడుకే ఉంటుంది. మారిన జీవనశైలి వల్ల అనేక మంది చిన్న వయసులోనే బ్రెయిన్‌ ట్యూమర్ల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.75 లక్షల కేసులు నమోదవుతున్నా యి. భారత్‌లో రోజుకు సగటున 500 బ్రెయిన్‌ ట్యూమర్‌ టెస్టులు జరుగుతున్నాయి. మెదడులో ఏర్పడిన కణితుల తొలగింపు చికిత్స కష్టమైంది. సర్జరీ సమయంలో వైద్యుడు అజాగ్రత్తగా వ్యవహరించినా.. మెదడులోని ఇతర నరాలు తెగిపోయినా రోగి కాళ్లు, చేతులు చచ్చుబడి పోయే ప్రమాదం ఉంది.

సర్జరీ చేసి గడ్డను తొలగించినా.. ఒక్కోసారి ఆ గడ్డ తాలూకు కణజాలంలోని కొంతభాగం అలాగే ఉండిపోతుంది. ఇది కొన్నాళ్ల తర్వాత మళ్లీ పెద్దదిగా మారి రెండో సర్జరీకి వెళ్లాల్సి వస్తుం ది. సర్జరీ పేరుతో కపాలాన్ని రెండుసార్లు కట్‌ చేసి తెరవడం వల్ల ఒక్కోసారి రోగి ప్రాణాలకే ప్రమాదం. సీటీ, ఎంఆర్‌ఐ ద్వారా గుర్తించలేని అతి సూక్ష్మమైన కణాలను సర్జరీ సమయంలోనే గుర్తించి, దాన్ని పూర్తిగా తొలగించే ఆధునిక ‘ఇంట్రా ఆపరేటివ్‌ 3టి ఎంఆర్‌ఐ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా నగరంలోని యశోద ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. బుధవారం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘3టి ఎంఆర్‌ఐ’ పనితీరును వైద్య బృందం వివరించింది. 

వందకుపైగా చికిత్సలు పూర్తి..
ఇప్పటి వరకు వందకుపైగా చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు యశోద ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. రెండో సర్జరీ అవసరం లేకుండా తొలి సర్జరీలోనే ఎంఆర్‌ఐ తీసి మిగిలిపోయిన గడ్డల తాలూకు అతిసూక్ష్మమైన కణాలను పూర్తిగా తొలగించగలిగినట్లు తెలిపింది. మిగిలిన కణాల నిర్మూ లనలో రేడియేషన్‌ సహా ఖరీదైన మందులు అవసరం లేకపోగా.. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో పాటు రోగి త్వరగా కోలుకునేందుకు అవకాశం లభించిందని ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ జీఎస్‌ రావు, న్యూరోసర్జన్‌ డాక్టర్‌ ఆనంద్‌ బాలసుబ్రమణ్యం, డాక్టర్‌ బీజే రాజేశ్‌ డాక్టర్‌ వేణుగోపాల్, డాక్టర్‌ శ్రీనివాస్‌ బొట్లతో కూడిన వైద్యబృందం తెలిపింది. 3టి ఎంఆర్‌ ఐ సాయంతో చేసిన చికిత్సల్లో వందశాతం సక్సెస్‌ రేటు సాధించామని పేర్కొంది. 

మరిన్ని వార్తలు