ఘరానా చీటీంగ్

25 Jan, 2016 00:58 IST|Sakshi
ఘరానా చీటీంగ్

మెదక్: మెదక్ పట్టణంలో సరికొత్త దోపిడీ దందాకు తెరలేచింది. కొందరు వ్యక్తులు మనీ లాండరింగ్‌ను పోలిన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. చిట్టీల ముసుగులో జోరు గా జీరోదందా సాగిస్తున్నారు. అడ్డదారిలో బంగారు అభరణాలు అంటగడుతూ సదరు వ్యక్తులు కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. స్కీమ్‌ల పేరిట అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే సాగుతోన్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.మెదక్ పట్టణంలో కొంతకాలంగా అక్రమ చిట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది. బంగారు ఆభరణాల వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొందరు చిట్టీల రూపంలో ప్రజల నుంచి నెలవారి వాయిదాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.

అదీగాక మరికొందరు రోజువారి ఫైనాన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వాహకులు మూడు చిట్టీ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో 200 మంది సభ్యులు ఉంటారు. నెలకు రూ.1,000 చొప్పున 25 నెలలపాటు వసూలు చేస్తారు. చీటీ పూర్తయిన తరువాత నగదుకు బదులు అంతే మొత్తానికి సరిపడా బంగారు ఆభరణాలను ముట్టజెబుతున్నారు. అదీగాక 25 నెలల పాటు ప్రతినెలా డ్రా నిర్వహించి ఒకరిని ఎంపిక చేస్తారు. అందులో ఎంపికైన వారికి రూ.25 వేల విలువ చేసే బంగారు ఆభరణాలు అందజేస్తారట.

మూడు గ్రూపుల నుంచి ప్రతి నెలా రూ.6 లక్షల చొప్పున, 25 నెలలకు రూ.1.50 కోట్లు వసూలు చేస్తున్నారు. సదరు నిర్వాహకులు తమ సంస్థను రిజిష్టర్ చేసుకోకుండానే ఇలాంటి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే రంగురంగుల్లో ఆకర్షణీయమైన కరపత్రాలు ముద్రించి జనాన్ని సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఈ రకంగా వసూలు చేస్తున్న మొత్తంతో సదరు వ్యక్తులు రియల్టర్ల అవతారమెత్తుతున్నారు.

ఇతర భూదందాలు సాగిస్తున్నారు. ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. జీరో దందా పేరిట పెద్ద మొత్తం వసూలు చేస్తున్నా అడిగే వారు లేకుండా పోయారు. అదీగాక పట్టణంలో డెయిలీ ఫైనాన్స్ పేరిట కూడా జీరోదందా సాగుతోంది. మూడు నుంచి ఐదు శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారులకు అప్పులిస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇటీవల మెదక్ మండలంలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు చిట్టీలు ఏర్పాటు చేశారు. అందులో ఎన్‌డీఎస్‌ఎల్  కార్మికులు సభ్యులుగా చేరారు.

తీరా అందరి వద్ద డబ్బులు వసూలు చేసిన తరువాత సదరు నిర్వాహకుడు బిచాణా ఎత్తేసి హైదరాబాద్‌కు పరారయ్యాడు. ఇలాంటి దందా ఒక్క మెదక్ పట్టణంలోనే గాక ఇతర ముఖ్య పట్టణాల్లోనూ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోన్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కొందరు కోరుతున్నారు. చిట్టీల వ్యాపారం పైకి బాగానే కన్పిస్తోన్న అంతర్గతంగా మోసాలు ఉన్నట్టు తెలుస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయంలో పోలీసులతోపాటు సంబంధిత శాఖల అధికారులు దృష్టిసారించి ప్రజలు మోసపోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
అనుమతులు లేకపోతే చర్యలు..
ఈ విషయమై ‘సాక్షి’ మెదక్ డీఎస్పీ రాజారత్నంను వివరణ కోరగా.. చిట్టీలు నడిపే వ్యక్తులు తప్పకుండా రిజిష్టర్ చేస్తేనే అధికారికంగా చెల్లుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు