నూతన ఇసుక  పాలసీ

4 Sep, 2019 11:04 IST|Sakshi

త్వరలో జిల్లాలో అమలు జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలో త్వరలో నూతన ఇసుక టాక్స్‌ పాలసీ అమలు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మంగళవారం నూతన ఇసుక టాక్స్‌ పాలసీపై మైనింగ్‌ అధికారులు, ఇసుక ట్రాక్టర్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా నూతన ఇసుక  పాలసీని రూపొందించిందని, దానిని అమలు చేస్తే ట్రాక్టర్ల ఓనర్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని తెలిపారు. ట్రాక్టర్‌ ఓనర్లకు సరైన రేటు లభిస్తుందని, ప్రజలకు తక్కువ ధరకే ఇసుక దొరకుతుందని తెలిపారు. ట్రాక్టర్ల ఓనర్లు వెంటనే ఏడీ మైనింగ్‌ ఆఫీస్‌లో ప్రతీ ట్రాక్టర్‌కు రూ.5 వేలు డిపాజిట్‌ చేసి వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

ఇసుక కావాలనుకునే వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే వారికి వరుస క్రమంలో కేటాయిస్తామని చెప్పారు. జిల్లాలో ఇసుక రీచ్‌లను గురించి రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని, ట్రాక్టర్‌ ఓనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇసుక అక్రమ రవాణా కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ప్రజలకు ఇసుక నిత్యావసరంగా మారిందని, అక్రమ రవాణా ద్వారా జరిమానాలు కట్టలేక ట్రాక్టర్‌ ఓనర్లు, అధిక ధరలుచెల్లించలేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు నూతన ఇసుక పాలసీని అమలు చేస్తోందని చెప్పారు.

ఈ నూతన ఇసుక పాలసీలో అక్రమ ఇసుకను తీసుకున్న వినియోగదారునిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నందున ఇకముందు జిల్లాలో ఎవరూ అక్రమ ఇసుకను తీసుకోరని ట్రాక్టర్‌ యజమానులకు తెలిపారు. వెంటనే ప్రభుత్వం రూపొందించిన ఇసుక పాలసీలో తమ ట్రాక్టర్లును నమోదు చేయించుకోవాలని సూచించారు. వారానికి ఒకసారి ఇసుక ట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఇసుక ట్రాక్టర్‌ ఓనర్ల సందేహాలను ఎమ్మెల్యే నివృత్తి చేశారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, మైనింగ్‌ ఏడీ వెంకటేశం, రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ జియాలో సిస్ట్‌ ఎం.రఘుబాబు, ప్రాజెక్టు ఆఫీసర్‌ తారక్‌ నాథ్‌రెడ్డి, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ సైదులు, ఇసుక ట్రాక్టర్ల ఓనర్లు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు