జూన్‌కు కొత్త టీచర్లు కష్టమే!

9 Mar, 2017 03:12 IST|Sakshi
జూన్‌కు కొత్త టీచర్లు కష్టమే!

నిబంధనల ఖరారుకు కమిటీ.. స్పష్టతకు మరింత సమయం
- కొత్త నోటిఫికేషన్ల జారీ కూడా ఆలస్యం..
- సమస్యగా మారిన శాఖల మధ్య సమన్వయ లోపం
- కొత్తగా ప్రారంభించే సంక్షేమ గురుకులాల్లో బోధనకు ఇబ్బందే  


సాక్షి, హైదరాబాద్‌

జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి రాష్ట్రంలో కొత్త టీచర్ల నియామకాలు జరిగే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్రంలో గతేడాది ప్రారంభించిన గురుకులాల్లోని ఖాళీలు, త్వరలో (2017–18 విద్యా సంవత్సరంలో) ప్రారంభించనున్న గురుకులాలకు అవసరమైన పోస్టుల భర్తీ విషయంలో ప్రధానంగా సమస్య నెలకొంది. సంక్షేమ శాఖలు, విద్యా శాఖ మధ్య సమన్వయ లోపం కారణంగా 7,306 టీచర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యా శాఖను సంప్రదించకుండానే గురుకుల సొసైటీలు నిబంధనలను రూపొందించడం, అడగకుండా తామెలా చెబుతామని విద్యా శాఖ చూస్తూ ఉండిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

చివరకు విద్యార్హతల విషయంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా కల్పించుకొని డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను తొలగించాలని, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారమే నిబంధనలను రూపొందించాలని ఆదేశించడంతో సంక్షేమ శాఖలు విద్యా శాఖను సంప్రదించాయి. ఈ నేపథ్యంలో గురుకుల నియామకాల్లో అనుసరించాల్సిన నిబంధనలతోపాటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి అవసరమైన నిబంధనల రూపకల్పనకు విద్యా శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పాఠశాల విద్య కమిషనర్‌ కిషన్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ జగన్నాథరెడ్డి, విద్యా శాఖ గురుకులాల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి, విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీహరిలతో కమిటీని నియమించింది. ఎన్‌సీటీఈ నిబంధనలను అధ్యయనం చేసి, నియామకాల్లో అనుసరించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలు, అర్హతలపై ప్రతిపాదనలు అందజేయాలని పేర్కొంది. కమిటీ ప్రస్తుతం ఆ పనిలో ఉంది.

అయినా ఇప్పటికిప్పుడు నియామకాలకు నోటిఫికేషన్లను జారీ చేసే పరిస్థితి లేదు. కమిటీ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాల్సి ఉండగా.. గురుకుల టీచర్ల భర్తీ నిబంధనలు, పాఠశాలల్లోని ఖాళీల భర్తీ నిబంధనలపై ప్రభుత్వం ఉత్తర్వులను వేర్వేరుగా జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టేలా ఉంది. ఆ తరువాత నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడి.. తదితర పనులను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు మరో మూడు నెలలకు పైగా సమయం పట్టనుంది. దీంతో వచ్చే జూన్‌లోగా పాఠశాలల్లో టీచర్లను నియమించే పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా ఇప్పటికే ప్రారంభించిన 16 బీసీ గురుకులాలు, 104 ఎస్సీ గురుకులాలు, 51 ఎస్టీ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాల్లో టీచర్ల సమస్య తప్పేలా లేదు.

కొత్త గురుకులాల్లోనూ అంతే..
మరోవైపు 2017–18 విద్యా సంవత్సరంలో (జూన్‌ నాటికి) ప్రారంభించే 119 బీసీ గురుకులాలు, 118 మైనారిటీ గురుకులాలకూ టీచర్ల సమస్య తప్పని పరిస్థితి. మరో 30 గురుకుల డిగ్రీ కాలేజీలకు అవసరమైన లెక్చరర్ల నియామకాలకు కూడా సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో జూన్‌కల్లా టీచర్ల ఖాళీలను భర్తీ చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రయత్నాలు సఫలమయ్యేలా లేవు. పాఠశాలల్లో 8 వేలకు పైగా ఖాళీల భర్తీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు