కాల్‌ చేస్తే ‘కనిపెట్టేస్తారు’!

14 Dec, 2017 03:47 IST|Sakshi

డయల్‌–100కు అదనపు హంగులు

ఆపదలో ఉన్న వారు ఫోన్‌ చేస్తే.. 

వారున్న ప్రాంతం కచ్చితంగా తెలిసేలా ఏర్పాటు 

ఇప్పటికే యూపీ, మహారాష్ట్రల్లో విజయవంతం 

అక్కడ లింకేజ్‌ ఇచ్చిన సంస్థతో నగర పోలీసుల సంప్రదింపులు 

3 నెలల్లో ఇక్కడా అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు 

సాక్షి, హైదరాబాద్‌:నగరంలోని అబిడ్స్‌ ప్రాంతం. ఓ వ్యక్తికి హఠాత్తుగా ఆపద ఎదురైంది. వెంటనే ‘డయల్‌–100’కు కాల్‌ చేశాడు. ఆపై తను ఎక్కడ ఉన్నాడో చెప్పే పరిస్థితుల్లో అతడు లేడు. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి చేరుకోవడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. ఇలాంటి పరిస్థితి చాలా సందర్భాల్లో నగర పోలీసులకు ఎదురవుతోంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసు విభాగం ‘డయల్‌–100’వ్యవస్థను ఆధునీకరిస్తోంది. బాధితుడు కాల్‌ చేసిన వెంటనే అతడు ఉన్న ప్రాంతాన్నీ తక్షణం గుర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని.. మూడు నెలల్లో నగరంలోనూ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 

రెస్పాన్స్‌ టైమ్‌ తగ్గించడమే లక్ష్యం.. 
బాధితుల నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు ఎంత త్వరగా వారి వద్దకు చేరితే అంత ఎక్కువ మేలు జరిగే ఆస్కారం ఉంది. దీన్నే సాంకేతికంగా ‘పోలీసు రెస్పాన్స్‌ టైమ్‌’అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం, తక్కువ సమయంలో ఘటనాస్థలికి చేరడానికి నగరంలో గస్తీ విధులు నిర్వర్తించే రక్షక్, బ్లూకోల్ట్స్‌కు ‘రెస్పాన్స్‌ టైమ్‌’నిర్దేశిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే గస్తీ వాహనాలను ‘డయల్‌–100’తో అనుసంధానించారు. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌) ఆధారంగా పనిచేసే ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే బాధితులు ఉన్న ప్రాంతాన్ని (లొకేషన్‌) పక్కాగా తెసుకోవాల్సి. ఇది సాధ్యమైతే రెస్పాన్స్‌ టైమ్‌ను గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

‘100’కాల్స్‌ను డైవర్ట్‌ చేసినప్పటికీ.. 
బాధితులు ‘100’కు ఫోన్‌ చేసి సహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. గస్తీ వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు అమర్చడంతో ‘100’సిబ్బందికి ఏ వాహనం ఎక్కడ ఉందో కచ్చితంగా తెలుస్తోంది. బాధితునికి సమీప ప్రాంతంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ కాల్‌ను డైవర్ట్‌ చేస్తున్నారు. కాల్‌ అందుకున్న గస్తీ సిబ్బంది బా«ధితుడిని సమాచారం అడిగి అతను ఉన్న ప్రదేశానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులు.. ‘100’కు ఎవరైనా కాల్‌ చేస్తే వారు కచ్చితంగా ఎక్కడ నుంచి చేశారనేది కంప్యూటర్‌ తెరపై కనిపించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఫలితంగా ‘రెస్పాన్స్‌ టైమ్‌’గణనీయంగా తగ్గింది. 

లొకేషన్‌ తెలుసుకోవడానికి లింకేజీ
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రైవేట్‌ సంస్థ అందించింది. నగర పోలీసులు ఆ సంస్థ ప్రతినిధులతో బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో బుధవారం సమావేశమయ్యారు. బాధితుడి లొకేషన్‌ తెలుసుకోవడానికి సెల్‌ సర్వీసు ప్రొవైడర్ల నుంచి లింకేజ్‌ తీసుకోవాలి. మొత్తం 11 సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి లింకేజ్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీకి చెందిన సంస్థ అందించనుంది. గరిష్టంగా మూడు నెలల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి నగర పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇది అమలైతే బాధితులకు సత్వర సహాయం అందడంతో పాటు బోగస్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టవచ్చని చెప్తున్నారు.  

మరిన్ని వార్తలు