తిరుపతికి ప్రత్యేక రైలు

21 Jul, 2019 10:55 IST|Sakshi

నేటి నుంచి ప్రారంభం

మూడు నెలల్లో 62 సర్వీసులు

ఇక వారానికి ఐదు రోజులు 

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైలు నడిపించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం కరీంనగర్‌ నుంచి తిరుపతికి వారానికి రెండు రోజులు రైలు నడుస్తుండగా మూడు నెలలపాటు అదనంగా మరో ప్రత్యేక రైలును నడిపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆది వారం తిరుపతి నుంచి కరీంనగర్‌కు ప్రత్యేక రైలు ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 కేంద్ర రైల్వేమంత్రికి ఎంపీ సంజయ్‌ వినతి
కరీంనగర్‌నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిపించాలని కోరుతూ గురువారం కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తిరుపతికి ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉందని, ప్రస్తుతం గురు, ఆదివారం కరీంనగర్‌ నుంచి తిరుపతికి రైలు నడుస్తోందని, ప్రతిరోజు రైలు నడిపించడంతో జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఎంపీ విజ్ఙప్తి మేరకు మంత్రి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు దక్షిణ మద్య రైల్వే జనరల్‌ మేనేజరు గజానన్‌ మాల్యా ముందుగా మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ప్రత్యేక రైలు నడిపించాలని నిర్ణయించారు. ఈ మూడు నెలల్లో రైలు విజయవంతంగా నడిచినట్లయితే రెగ్యులర్‌ చేయాలని ఆదేశించారు. ప్రత్యేక రైలులో ఏసీ, స్లీపర్‌క్లాసులు అందుబాటులో ఉన్నట్లు కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ రాజశేఖరప్రసాద్‌ తెలిపారు. పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గుంటూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని వివరించారు.

నేడు తిరుపతిలో ప్రారంభం....
కరీంనగర్‌–తిరుపతి ప్రత్యేక రైలును ఆదివారం తిరుపతిలో ప్రారంభించనున్నారు. తిరుపతి నుంచి ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో నడుస్తుంది. కరీంనగర్‌ నుంచి మంగళ, బుధ, శుక్రవారాల్లో వెళ్తుంది. తిరుపతి నుంచి ఈ నెల 21,23,25,28,30,ఆగస్టు–1,4,6,8,11,13,15, 18,29,22,25,27,29, సెప్టెంబరు 1,3,5,8,10, 12,15,17,19,22,24,26,29 తేదీల్లో ఉంటుంది. కరీంనగర్‌ నుంచి ఈ నెల 22,24,26,31,ఆగస్టు 2,5,7,9,12,14, 16,19, 21,23,26,28,30, సెప్టెంబరు 2,4,6,9,11,13, 16,18,20,23,25, 27,30 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. 

మరిన్ని వార్తలు