కరోనాకు కొత్త చికిత్స

9 Jul, 2020 06:36 IST|Sakshi

సీఎస్‌ఐఆర్‌ ప్రయోగాలు.. హైదరాబాద్‌ కంపెనీ భాగస్వామ్యం 

చికిత్సను మరింత బలోపేతం చేసే దిశగా అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సకు సరికొత్త, వినూత్న చికిత్స అందించేందుకు కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ప్రయత్నాలు ప్రారంభించింది. హెచ్‌ఐవీ చికిత్సలో ఉపయోగించే యాంటీ రెట్రోవైరల్‌ మందులను మరికొన్నింటిని కలిపి వాడటం ద్వారా ప్రస్తుతం కరోనాకు అందిస్తున్న చికిత్సను బలోపేతం చేయాలనేది సీఎస్‌ఐఆర్‌ ఆలోచన. ఇందుకోసం హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి మూడో దశ ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాలని సీఎస్‌ఐఆర్‌ ప్రభుత్వ సంస్థలకు బుధవారం దరఖాస్తు చేసింది. ‘ముకోవిన్‌’ అని పిలుస్తున్న ఈ ప్రయోగాలు ఢిల్లీలోని మెడాంటా మెడిసిటీ ఆసుపత్రి భాగస్వామ్యంతో జరగనున్నాయి. 300 మంది రోగులను నాలుగు సమాన గుంపులుగా విడదీసి ఈ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను 17 నుంచి 21 రోజుల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. 

ముమ్మరంగా అధ్యయనం 
ఈ కొత్త ప్రయోగాల్లో ఉపయోగించే మందుల వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశముందని, సీఎస్‌ఐఆర్‌ సంస్థలతో పాటు హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, జమ్మూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ ప్రయోగాల్లో పాల్గొంటున్నాయని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ సి.మాండే ఒక ప్రకటనలో తెలిపారు. శరీరంలో కరోనా వైరస్‌ పెరగడానికి కారణమయ్యే ప్రొటీన్లు, సైటోకైన్‌ ఉప్పెనకు దారితీసే అంశాలపై ఈ అధ్యయనం దృష్టి పెడుతుందని లక్సాయ్‌ లైఫ్‌సైన్సెస్‌ సీఈవో రామ్‌ ఎస్‌.ఉపాధ్యాయ తెలిపారు. ఫావిపిరవిర్‌ను కోల్‌చికైన్‌తో కలిపి, అలాగే ఉమిఫెనొవిర్‌ కోల్‌చికైన్‌ మిశ్రమం, నఫామోస్టాట్‌కు 5–అమినోలెవులినిక్‌ యాసిడ్‌ను కలిపి అందించడం ఈ అధ్యయనంలో కీలకాంశం. ఫావిపిరవిర్‌ను జపాన్‌లో ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేయగా, దాన్ని కరోనాకు ఉపయోగించవచ్చునని ఐఐసీటీ గతంలోనే సూచించింది. మిగిలిన మందులు వైరస్‌ శరీరంలోకి ప్రవేశించేందుకు ఉన్న మార్గాలు, నకళ్లు సృష్టించుకోవడాన్ని నిరోధించడం వంటి అనేక అంశాలపై ప్రభావం చూపుతాయి. ఈ మందుల మిశ్రమాలు సురక్షితమైనవని, సమర్థంగా పనిచేస్తాయని నిర్ధారించడం ఈ అధ్యయనం ఉద్దేశం. అన్నీ సవ్యంగా సాగితే కరోనా చికిత్సకు మరింత సామర్థ్యం చేకూరుతుందని అంచనా.  

మరిన్ని వార్తలు