బిడ్డ పెళ్లికి సిద్ధమై... చావుకు ఎదురెళ్లారా?

6 Mar, 2020 10:48 IST|Sakshi
వినయశ్రీ

కొడుకు దుర్మరణంతో కుదేలైన సత్యనారాయణరెడ్డి కుటుంబం

హైదరాబాద్‌లో ఫ్లాట్‌ తీసుకుని... పాలుపొంగించకుండా పరలోకానికి

బలాన్నిస్తున్న డైరీలు, పుస్తకాల్లోని రాతలు

పిల్లి ఎదురొచ్చిందని వేదనకు గురైన ఎమ్మెల్యే సోదరి రాధ

స్థిమితం లేని నిర్ణయాలతో దారుణం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘బీడీఎస్‌ చదువుతున్న కూతురును హౌజ్‌ సర్జన్‌ చేయాలి... హైదరాబాద్‌లో స్థిరపడ్డ కుటుంబంలోకి కోడలుగా పంపాలి... మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలు చేయాలి... కొడుకు జ్ఞాపకాల నుంచి మెల్లగా బయటపడాలి... దానధర్మాలు చేస్తూ జీవితం గడపాలి..’’ గత నెల 12న కాకతీయ కాలువలో కారుతో సహా జలసమాధి అయిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి ఆలోచనలు ఇవి. తన సన్నిహితులు, స్నేహితుల వద్ద ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కొడుకు మరణం గురించి తరచూ బాధపడే సత్యనారాయణరెడ్డి కూతురుకు పెళ్లి చేసి, శేషజీవితం ప్రశాంతంగా గడపాలని భావించాడు. కానీ చిన్న చిన్న కారణాలతో మానసిక వేదనకు గురైన సత్యనారాయణరెడ్డి కుటుంబంతో సహా కారుతో కాకతీయ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు.

ముందుగా ప్రమాదం అని భావించినప్పటికీ, పోలీసుల విచారణలో ఆత్మహత్య అనే తేలగా, ఇటీవల ఫెస్టిసైడ్‌ దుకాణం, ఇంట్లో దొరికిన డైరీలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాము మరణిస్తే ఆస్తిని తిరుమల వేంకటేశ్వర స్వామికి చెందేలా చూడాలని రాసిన డైరీతోపాటు భక్తి, విశ్వాసాల పేరుతో ఆయన భార్య రాధ డైరీలు, పుస్తకాల్లో రాసిన రాతలు ఈ ఘటనను ఆత్మహత్యగా నిర్ధారిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం కొడుకు మరణించగా, కోలుకోని కుటుంబం ఇప్పటికీ కుమిలిపోతూ ఆవేశంతో కూడిన నిర్ణయంతో అనంత లోకాలకు చేరినట్లు తెలుస్తోంది. దేవుని గదిలో ప్రతిరోజు కొడుకు ఫొటోకు పూజించే వీరు చివరికి కొడుకు చెంతకే పయనమై ప్రాణాలు వదిలారు.

ఫ్లాట్‌లో పాలు పొంగించేందుకు కూతురును పిలిపించి..
నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దంత వైద్య కాలేజీలో బీడీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న వినయశ్రీని తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి, రాధ జనవరి 25న కరీంనగర్‌కు పిలిపించారు. అంతకుముందే జనవరి 21న మేడ్చల్‌ సమీపంలోని కొంపల్లిలో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకొన్నారు. 26న రిపబ్లిక్‌ డే రోజు పాలుపొంగించాల్సి ఉండడంతో ఆ రోజు ఉదయమే కూతురుతో కలిసి దంపతులు కారులో బయలుదేరి వెళ్లారు. కారులో వెళ్తుండగా, ప్రజ్ఞాపూర్‌ వద్ద పిల్లి అడ్డం రావడంతో రాధ తీవ్ర వేదనకు గురైనట్లు సమాచారం.

కొడుకు మరణం తరువాత భక్తి విశ్వాసాలను అధికంగా పాటిస్తున్న రాధ ఇంట్లో పాలు పొంగించేందుకు వెళ్తుంటే పిల్లి అడ్డు రావడమేంటని తీవ్ర వేదనకు గురైంది. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఓ కుటుంబంతో పెళ్లి సంబంధం కూడా కలుపుకున్న సత్యనారాయణరెడ్డి, రాధ పిల్లి ఎదురవడం గురించి కాబోయే అల్లునితో మాట్లాడినట్లు సమాచారం. వీరి బాధ చూసిన అతను సిద్దిపేటలోని ఓ సిద్ధాంతి వద్దకు పంపగా, ఆయన ఏ దోషం లేదని చెప్పడంతో తిరిగి హైదరాబాద్‌ వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత రాధ కారు నుంచి దిగి ఫ్లాట్‌లోకి వెళ్లకుండా రోదించడంతో సత్యనారాయణరెడ్డి తిరిగి కారును కరీంనగర్‌ తీసుకొచ్చాడు. చదవండి: పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి అనుమానాస్పద మృతి!


ఆ రాత్రి ఏం నిర్ణయం జరిగిందో..?
జనవరి  26న హైదరాబాద్‌ ఫ్లాట్‌లో పాలు పొంగించకుండా కరీంనగర్‌ వచ్చిన సత్యనారాయణరెడ్డి, ఆయన భార్య రాధ, కూతురు వినయశ్రీ ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కొడుకు మరణం తరువాత మానసికంగా కుంగిపోయిన రాధ, సత్యనారాయణరెడ్డి కూతురుకు పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని భావించే పెళ్లి సంబంధం కూడా సెటిల్‌ చేసినట్లు తెలుస్తోంది. పిల్లి ఎదురొచ్చిన ఘటనతో భార్య ఫ్లాట్‌ ముందు రోదించడం, కాబోయే అల్లుని కుటుంబం ఏమనుకుంటుందోనని భావించడం వంటి కారణాలతో తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 27న ఉదయం ఇంటి పనిమనిషితో టూర్‌కు, తెలిసిన వారికి యాత్రకు వెళ్తున్నట్లు చెప్పడం, కూతురు సైతం తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఫంక్షన్‌కు వెళ్తున్నామని చెప్పడం సందేహాలకు తావిచ్చింది. జనవరి 25న ప్రమాదవశాత్తూ కారు కాకతీయ కాలువలో పడి కొట్టుకుపోవడం పత్రికల్లో చదివిన సత్యనారాయణరెడ్డి అదే సంఘటనను ప్రేరణగా తీసుకొని బలవన్మరణానికి నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. చదవండి: వినయశ్రీ మృతి: స్నేహితుల ఆవేదన

జనవరి 27న సాయంత్రం 3 గంటల సమయంలో షాపులో పనిచేసే నర్సింగ్‌తో మాట్లాడిన సత్యనారాయణరెడ్డి తరువాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. 4.30 గంటలకు కాబోయే అల్లుడు ఫోన్‌ చేస్తే మూడు ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ అయినట్లు విచారణలో తేలింది. చీకటి పడ్డ తరువాత రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో నుంచి కారులో ముగ్గురు హైదరాబాద్‌ వైపు బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. చీకటి పడ్డ తరువాతే ప్లాన్‌ ప్రకారమే కారులో వెళ్లి కాకతీయ కాలువలోకి కారును తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఏదేమైనా... చిన్న చిన్న సంఘటనలతో తీసుకున్న తప్పుడు నిర్ణయం భావిభారత వైద్యురాలిని, ఓ ఇంటికి కోడలు కావలసిన యువతిని బలి తీసుకొంది. ఓ కుటుంబాన్ని జల సమాధి చేసింది.

మరిన్ని వార్తలు