‘పరదాగేట్‌ ప్యాలెస్‌’ విక్రయంలో మరో వివాదం

10 Mar, 2020 09:25 IST|Sakshi

నజ్రీభాగ్‌ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్తకోణం  

‘పరదాగేట్‌ ప్యాలెస్‌’ విక్రయంలో మరో వివాదం

ఇప్పటికే సుఖేష్‌ గుప్తా తదితరులపై ముంబైలో కేసు

ప్యాలెస్‌ తాకట్టుతో మోసం చేశారన్న ఎస్‌ఆర్‌ఈఐ

సీసీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌

నిందితులుగా సుఖేష్‌ గుప్తా సహా మరో నలుగురు  

సాక్షి, సిటీబ్యూరో: నిజాం వైభవానికి ప్రతీక అయిన నజ్రీభాగ్‌ ప్యాలెస్‌ విక్రయం వివాదంలో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ముంబై కేంద్రంగా ఓ కేసు నమోదు కాగా.. తాజాగా పరదాగేట్‌ ప్యాలెస్‌ను తమకు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారని, ఆపై మోసం చేస్తూ మరో సంస్థకు అమ్మేశారని ఆరోపిస్తూ ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇ.వేణుగోపాల్‌ హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) ఫిర్యాదు చేశారు. దీంతో నగరానికి చెందిన ఆషి రియాల్టర్స్, ముంబై సంస్థ నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన నిందితుల జాబితాలో సుఖేష్‌ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేష్‌కుమార్‌ ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వివాదం వెనక అసలు కథ..  
ముంబైకి చెందిన నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ రెసిడెన్షియన్, కమర్షియల్‌ నిర్మాణాల్లో పేరెన్నికగన్న సంస్థ. ఇది కొన్నాళ్ల క్రితం ప్రిన్స్‌ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా నుంచి కింగ్‌కోఠిలోని నజ్రీభాగ్‌ (పరదాగేట్‌) ప్యాలెస్‌ను కొనుగోలు చేసింది. 5 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవంతి ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ వ్యక్తిగత నివాసంగా వెలుగొందింది. అయిదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌గా పిలిచే నిర్మాణంలో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒకదాంట్లో నిజాం ట్రస్ట్, మరోదాంట్లో కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి కొనసాగుతున్నాయి. మూడో భవనమైన నజ్రీభాగ్‌కు జీపీఓ హోల్డర్‌గా ఉన్న ఎస్త్రా నుంచి నిహారిక కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ప్యాలెస్‌ను నిహారిక సంస్థ భౌతికంగా తన అధీనంలోకి తీసుకోవాల్సి ఉంది. 2019 ప్రథమార్థంలో సంస్థ డైరెక్టర్ల మధ్య కొన్ని స్పర్థలు వచ్చాయి. దీంతో గత ఏడాది జూన్‌లో నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉద్యోగులు హైదరాబాద్‌ వచ్చినప్పుడు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే నజ్రీభాగ్‌ ప్యాలెస్‌ యాజమాన్య హక్కులు కశ్మీర్‌కు చెందిన ఐరిష్‌ హాస్పిటాలిటీస్‌కు బదిలీ అయినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా ఆరా తీయగా నిహారిక సంస్థకు రాజీనామా చేసి బయటకు వచ్చిన హైదరాబాద్‌ వాసి రవీంద్రన్‌తో పాటు సురేష్‌కుమార్‌ తదితరులప్రమేయంతోనే ఇది జరిగినట్లు తేల్చారు.

నిహారిక సంస్థతో పాటు నజ్రీభాగ్‌ ప్యాలెస్‌ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వీళ్లు రూ.150 కోట్లకు ఐరిష్‌ హాస్పిటాలిటీస్‌కు 2019 జనవరిలో విక్రయించేశారు. ఈ విషయాలు గుర్తించిన నిహారిక సంస్థ ముంబైలోని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిహారిక సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు అక్రమంగా విక్రయించేశారని అనుమానించిన పోలీసులు కేసును దర్యాప్తు నిమిత్తం అక్కడి ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి (ఈఓడబ్ల్యూ) బదిలీ చేసింది. దీంతో ఆ వింగ్‌లోని యూనిట్‌– 9 అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రవీంద్రన్, సురేష్‌లతో పాటు మహ్మద్‌ ఉస్మాన్, సుఖేష్‌ గుప్తాలను నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కేసులో కొన్ని అరెస్టుల్ని చేసిన ముంబై ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

కేసు కొనసాగుతుండగానే..  
అక్కడ కేసు ఇలా ఉండగానే.. ఇటీవల బంజారాహిల్స్‌ కేంద్రంగా పని చేసే ఎస్‌ఆర్‌ఈఐ ఎక్వీప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు చెందిన అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇ.వేణుగోపాల్‌ సీసీఎస్‌ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. బషీర్‌బాగ్‌ కేంద్రంగా పని చేసే ఆషి రియాల్టర్స్‌కు చెందిన సుఖేష్‌ గుప్తా, నీతు గుప్తా, ముంబైకి చెందిన నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సురేష్‌ కుమార్, రవీంద్రన్‌లు ఎస్‌ఆర్‌ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఏడాది అక్టోబర్‌ నుంచి ప్రారంభించి ప్రతి మూడు నెలలకు ఇన్‌స్టాల్‌మెంట్‌ చొప్పున చెల్లిస్తూ మొత్తం నాలుగు దఫాల్లో రుణం వడ్డీతో సహా తీర్చాలన్నది ఒప్పందం. ఈ రుణానికి సంబంధించి ష్యూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న ఎనిమిది ఎకరాల స్థలంతో పాటు కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీభాగ్‌ ప్యాలెస్‌ను చూపిస్తూ 2018 జూలై 15న అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ఈఐ నుంచి తీసుకున్న రుణం చెల్లించడంలో సుఖేష్‌ గుప్తా తదితరులు విఫలం కావడంతో గత ఏడాది డిసెంబర్‌ 30న హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసి ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ రూ.102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీభాగ్‌ను వేలం వేయాలని ప్రయత్నించగా.. నిందితులు అప్పటికే తమను మోసం చేస్తూ ఐరిష్‌ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి ఆషి, నిహారిక సంస్థలతో చేసిన సంప్రదింపులు ఫలితాలు ఇవ్వకపోవడంతో ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ గత నెల 28న సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు సుఖేష్‌ గుప్తా, నీతు గుప్తా, రవీంద్రన్, సురేష్‌కుమార్‌లపై ఐపీసీ 420, 406 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా