అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం

7 Nov, 2019 10:20 IST|Sakshi
విజయారెడ్డి (ఫైల్‌) ,హ్యాండ్‌ బ్యాగ్, ఇతర ఫైళ్లు

తలదించుకుని తన పని తాను చేసుకునే తహసీల్దార్‌ విజయారెడ్డి  

అదే ఆమె హత్యకు కారణమైంది..  

అప్రమత్తంగా ఉంటే ప్రాణాలు దక్కేవి

పెద్దఅంబర్‌పేట: ఓ రైతు చేతిలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి అప్రమత్తంగా ఉంటే కనీసం ప్రాణాలైనా దక్కేవి. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరితో ఆమె అర నిమిషం లేదా నిమిషం  పాటు మాట్లాడిన అనంతరం తలదించుకొని తనపని తాను చేసుకుంటూ ఉండేది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. తన చాంబర్‌ లోపలికి వచ్చే వ్యక్తులను పూర్తిగా గమనించకుండా తన విధుల్లో మునిగిపోయే మనస్తత్వమే ఆమె ప్రాణాలను బలిగొంది. ఆఫీసులోకి వచ్చే వ్యక్తులతో మాట్లాడి వారు వెళ్లిన తర్వాతే వేరే పనులు చేసుకునే అలవాటు ఉంటే సురేష్‌ పెట్రోల్‌తో దాడియత్నాన్ని కొంతమేర అయినా అడ్డుకునే అవకాశం ఉండేది. తహసీల్దార్‌ విజయారెడ్డి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పక్కా ప్రణాళికతోనే ఆమెను అంతమొందించడానికి సురేష్‌ పూనుకున్నట్లు జరిగిన సంఘటన ఆధారంగా తెలుస్తోంది.  

అబ్దుల్లాపూర్‌మెట్‌లోని  కార్యాలయం వద్ద తహసీల్దార్‌ కారు
ఆఫీసు ఎదుటే తహసీల్దార్‌ కారు...  
నిత్యం కార్యాలయానికి కారులో వచ్చి వెళ్లే తహసీల్దార్‌ విజయారెడ్డి సోమవారం కూడా అదే కారులో వచ్చారు. అయితే, అనూహ్యంగా సురేష్‌ ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో లిప్తపాటుకాలంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమెను రక్షించే క్రమంలో కారు డ్రైవర్‌ గురునాథం కూడా తీవ్రంగా గాయపడి మంగళవారం కన్నుమూసిన విషయం విధితమే. కారు డ్రైవర్‌ గురునాథం...అందులో రోజూ ప్రయాణించే తహసీల్దార్‌ విజయారెడ్డి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతం ఆ కారు తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టు కిందనే ఉంది. రోడ్డుపై ప్రయాణించే వారందరూ తహసీల్దార్‌ కారును చూస్తూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంది.  

మరిన్ని వార్తలు