వాహనాల సిరీస్ మార్పు షురూ!

14 Jul, 2014 02:48 IST|Sakshi
వాహనాల సిరీస్ మార్పు షురూ!

హైదరాబాద్: తెలంగాణలో అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను టీఎస్ సిరీస్‌లోకి మార్చే కసరత్తు మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి సోమ, మంగళవారాల్లో మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఏపీ సిరీస్‌తో కొనసాగుతున్న పాత వాహనాల సిరీస్‌ను మార్చాలా వద్దా అన్న విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆదివారంతో ముగిసింది. ఏపీ సిరీస్‌తో ఉన్న అన్ని వాహనాలను నాలుగు నెలల్లో టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలంటూ జారీ చేసిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా ప్రజల నుంచి అభ్యంతరాలు అందని నేపథ్యంలో... ఆ ఉత్తర్వును అమలు చేయాలని ప్రభుత్వం భ్చవిస్తోంది.

ఏకంగా 70 లక్షల వాహనాల సిరీస్ మార్చే అంశంపై న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంతకాలం కచ్చితమైన అభిప్రాయం వ్యక్తం చేయకుండా ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. దీనిపై ఇప్పటికీ స్పష్టత రానప్పటికీ.. గడువులోపు అభ్యంతరాలు పెద్దగా రానందున సిరీస్ మార్పు విషయంలో పాత ఉత్తర్వులకు కట్టుబడాలని ప్రభుత్వం భావిస్తోందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.  సిరీస్ మార్చటానికి ఎలాంటి రుసుము అవసరం లేదని పాత ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసినా.. వాహనానికి సంబంధించిన అధికార పత్రాల మార్పునకు అయ్యే ఖర్చు మాత్రం వాహనదారులే భరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కార్లకు, ద్విచక్రవాహనాలకు ఇది విడివిడిగా ఉండనుంది. అయితే ఈ ఖర్చు రూ.200కు మించకుండా ఖరారు చేయనున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు