ఖాకీలకు కొత్త వాహనాలు!

2 Jan, 2015 01:51 IST|Sakshi
ఖాకీలకు కొత్త వాహనాలు!

జిల్లా పోలీస్‌శాఖకు కొత్త వాహనాలు సమకూర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎస్పీ వి.శివకుమార్ పలు వాహనాలను పరిశీలించినట్టు సమాచారం. పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు సుమారు 70 వాహనాలను, పోలీస్ స్మార్ట్‌సిటీల కోసం ప్రత్యేకంగా మరికొన్ని వాహనాలను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సర్కారు నుంచి ఆమోదం లభించిన వెంటనే జిల్లా పోలీసులకు కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.
 
70 వాహనాలు, వంద బైక్‌లకు ప్రతిపాదనలు
పోలీసు స్మార్ట్‌సిటీలకు అదనంగా ఏర్పాటు
ప్రస్తుతమున్నవి.. 130 వాహనాలే..
36కి పైగా ఠాణాలకు కొరత

 
కరీంనగర్ క్రైం: జిల్లా పోలీస్‌శాఖ కొన్నేళ్లగా వాహనాల కొరతతో ఇబ్బందులు పడుతోంది. పోలీసు సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చేసినా అందుకు అనుగుణంగా వాహనాల కేటాయింపు జరగడం లేదు. డయల్ 100 సేవలు, 24 గంటల పెట్రోలింగ్‌కు కూడా ప్రత్యేక వాహనాలు అందుబాటులో లేవు. కొన్నేళ్లుగా వాహనాల కోసం ప్రతిపాదనలు పంపుతున్నా మంజూరుకావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో 68 పోలీస్‌స్టేషన్లు, 18 సర్కిళ్లు, ఆరు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటితోపాటు ఆర్మ్‌డ్, ఆక్టోపస్, ఎస్‌బీ, ఎన్‌ఐబీ తదితర విభాగాలు పని చేస్తున్నాయి. వీటిన్నంటికి వాహనాలు తప్పనిసరి. కానీ జిల్లావ్యాప్తంగా 32 పోలీస్‌స్టేషన్లకు మాత్రమే ప్రభుత్వ వాహనాలున్నాయి. నిఘా, ఇతర విభాగాలకు అసలు వాహనాలే లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలనే అన్ని సివిల్, ఆర్ముడ్ విభాగాల అధికారులకు వినియోగిస్తున్నారు.

ప్రభుత్వ వాహనాలు లేని పోలీస్‌స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలు సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన వాహనాలకు మాత్రమే ప్రతి నెల 110 లీటర్ల డీజిల్ కేటాయిస్తుంది. ప్రైవేట్ వాహనాలు వినియోగించుకుంటున్న వారికి డీజిల్ కోటా ఉండదు. దీంతో వీటి నిర్వహణ, అద్దె రూపంలో అయా పోలీస్‌స్టేషన్లపై ప్రతి నెల సుమారు రూ.25 వేల భారం పడుతోంది.
 
కాలం చెల్లిన వాహనాలే ఎక్కువ..
ప్రస్తుతం జిల్లా పోలీస్‌శాఖలో 130 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు మూడు నెలల్లో సుమారు 15 వాహనాలు జీవితకాలం ముగియనుంది. వీటితోపాటు మరో 50  వాహనాలు కొనుగోలు చేసి సుమారు 20 ఏళ్లు దాటింది. ఇవి కూడా తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. గతేడాది జీవితకాలం కంటే ఎక్కువగా వినియోగించిన సుమారు 10 వాహనాలను తుక్కుకు పంపించారు. మరో రెండు మూడు నెలలు గడిస్తే మరికొన్ని వాహనాలు జీవితాకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో పోలీస్ సేవలకు ఇబ్బందులు తప్పవు.

ఉన్నవాటి నుంచి వీఐపీ సెక్యూరిటీ కోసం పలు వాహనాలు కేటాయించాల్సి వస్తోంది. బందోబస్తు సమయంలో ఎస్కార్టు చేసే సందర్భాల్లో రిపేర్లకు వస్తున్నాయి. వీటిని మరమ్మతులు చేయించడం భారమవుతోంది. ప్రభుత్వం కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుండడంతో జిల్లాకు కొత్త వాహనాలు కేటాయించాలని పలుమార్లు జిల్లా పోలీస్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. కానీ ఇప్పటివరకు వాహనాలను మంజూరు చేయకపోవడం గమనార్హం.
 
డయల్ 100, పెట్రోలింగ్‌కు ఇబ్బందులు
ప్రసుత్తం జిల్లాలో మూడు పెట్రోలింగ్ రక్షక్ వాహనాలు మాత్రమే ఉండగా ఇవి కూడా నగరంలో మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలో రెండు వాహనాలు తరచూ రిపేర్లు వస్తున్నాయి. డయల్ 100 సేవలు అందించడానికి ప్రత్యేకంగా వాహనాలు అవసరం. ఈ సేవల ప్రారంభంలో ప్రతి స్టేషన్‌కు ఒక వాహనం కేటాయిస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఒక్క వాహనం కూడా కేటాయించలేదు.

దీంతో సిబ్బంది తమ సొంత ద్విచక్రవాహనాలనే డయల్ 100 సేవలకు వినియోగిస్తున్నారు. వీటికి ఎలాంటి బడ్జెట్ లేకపోవడంతో సిబ్బందిపై అర్థికంగా భారంగా పడుతోంది. అలాగే పెట్రోలింగ్ విభాగాన్ని బలోపేతం చేసి అందుబాటులో ఉన్న వాహనాలకు జీపీఎస్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైవేట్ వాహనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లాలో పలు పోలీస్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త వాహనాలు తప్పనిసరి.
 
70 వాహనాలు, 100 బైక్‌లు..
జిల్లా పోలీస్ శాఖకు 70 వాహనాలు, వంద బైక్‌లు కేటాయించాలని ఎస్పీ శివకుమార్ ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. జిల్లా రోడ్లకు అనుకూలంగా ఉన్న పలు వాహనాలు ఎస్పీ పరిశీలించినట్టు తెలిసింది. దీనికి ఉన్నతాధికారులు సైతం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ఆనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు