జిల్లాకు కొత్త ఓటరు కార్డులొచ్చాయోచ్‌..!

29 Nov, 2018 10:00 IST|Sakshi

జిల్లాకు చేరిన ఓటరు గుర్తింపు కార్డులు 

పంపిణీకి చర్యలుతీసుకుంటున్న అధికారులు 

అందించే బాధ్యతలు వీఆర్వోలకు అప్పగింత 

సాక్షి, మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ బూత్‌లకు వెళ్లే ఓటర్ల కోసం కమిషన్‌ ఫొటో గుర్తింపు కార్డు(ఎపిక్‌)లు జారీ చేసింది. వంద శాతం పోలింగ్‌ లక్ష్యంగా ఎన్నికల కమిషన్‌ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఓటరుగా నమోదైన ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డు జారీ చేస్తోంది.

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఎదురవకుండా.. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న జిల్లా యంత్రాంగం ఓటరు గుర్తింపు కార్డులను సైతం ఓటర్లకు అందజేసేందుకుచర్యలు చేపట్టారు. 

రిటర్నింగ్‌ కార్యాలయాలకు.. 
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల గుర్తింపు కార్డులు ఎన్నికల కమిషన్‌ నుంచి జిల్లాకు చేరాయి. ఈ సందర్భంగా వీటిని నియోజకవర్గాల వారీగా వేరు చేసి రిటర్నింగ్‌ కార్యాలయాలకు పంపించారు. అక్కడ గ్రామాల వారీగా, పోలింగ్‌ బూత్‌ల వారీగా కార్డులను వేరు చేయడంలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన సమయంలో ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ఫొటో గుర్తింపు కార్డుల్లో ఒకటైన ఎలక్టోరల్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు(ఎపిక్‌)ను తీసుకెళ్తే సరిపోతుంది. 


ఓటరు ఫోటో గుర్తింపు కార్డులు 10,22,244 
జిల్లాలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు సంబంధించి ఎపిక్‌ కార్డులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 10,22,244 మంది ఓటర్లు ఉండగా.. వీరికి సంబంధించిన కార్డులను బూత్‌ల వారీగా విభజన ఆయా రిటర్నింగ్‌ కార్యాలయాల్లో జరుగుతోంది.

విభజన పూర్తయ్యాక గ్రామాలకు చేరవేసి వీఆర్వోల పర్యవేక్షణలో వాటిని ఓటర్లకు పంపిణీ చేయనున్నారు. ప్రతీ ఓటరుకు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. 
 

మరిన్ని వార్తలు