యువలోకం

18 Sep, 2018 09:59 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ‘నేటి యువతీ, యువకులే దేశానికి మార్గనిర్దేశకులు... దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే సమర్థులను ఎన్నుకోవడంలో యువత పాత్ర కీలకంగా ఉండాలి... అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది..’ ఇదంతా అందరూ చెప్పేదే. అయితే, ఇది జరగాలంటే ఓటరుగా యువతీ, యువకులందరూ నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరముంది. ఈమేరకు 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన షెడ్యూల్‌ మేరకు నమోదు చేయించేలా అధికారులు ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నారు.
 
అవగాహన 
కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉంది. దీంతో అధికారులు విస్తృత ప్రచారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ పదేపదే అవకాశం కల్పిస్తున్నా యువత ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే అంశమే అయినా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు అధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

కమిషన్‌ ఆదేశాలతో... 
నూతన ఓటర్ల నమోదుకు అవకాశమున్న విషయమై ప్రచారం చేయాలని ఇప్పటికే పలు సమావేశాలు, సమీక్షల ద్వారా జిల్లాలోని అధికార యంత్రాన్ని ఎన్నికల కమిషన్‌ అలర్ట్‌ చేసింది. కమిషన్‌ అధికారులు పలు సమీక్షల ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేస్తూనే ఓ వైపు ఓటర్ల జాబితాల రూపకల్పనకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయడంతో పాటు నిరేర్దేశించిన షె డ్యూల్‌ మేరకు అక్టోబర్‌ 8న తుది ఓటర్ల జాబితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇం దులో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు  ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. కాగా, అక్టోబర్‌ 4న క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్‌ 8న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
 
విస్తృత ప్రచారం 
జిల్లాలో ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్థులతో ఎలక్టోరల్‌ లిటరసీ క్లబ్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాలతో ఇప్పటికే అవగాహన కల్పించారు. తాజాగా ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన షెడ్యూల్‌ మేరకు 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ చైతన్యపరిచి ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం బూత్‌ లెవల్‌లో, మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో, ఆన్‌లైన్‌లో గానీ ఓటరుగా నమోదు చేసుకునేలా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. స్కూల్‌ విద్యార్థులతో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రచార రథాలను జాయింట్‌ కలెక్టర్‌ వెంకట్రావు ప్రారంభించగా.. బస్టాండ్లు, ఆస్పత్రులు వంటి రద్దీ ప్రాంతాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటుచేసి సిబ్బంది ద్వారా ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రచారం చేస్తున్నారు.

నమోదు ఇలా... 

  • 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ప్రతీ ఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు అర్హులు. 
  • గ్రామంలోని బూత్‌లెవెల్‌ అధికారి లేదా తహసీల్దార్‌ కార్యాలయంలో కానీ ఫారం–6 దరఖాస్తులు సమర్పించాలి. 
  • మీ సేవా కేంద్రాల్లో లేదా స్వయంగా ఆన్‌లైన్‌లో ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.   
మరిన్ని వార్తలు