పక్కాగా మార్పులు, చేర్పులు

3 Feb, 2018 16:31 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, జేసీ రవీందర్‌రెడ్డి

     నూతన ఓటర్ల పేర్లు నమోదు చేయాలి

     క్లెయిమ్స్, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలి

     రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇన్‌చార్జి సీఈవో అనూప్‌సింగ్‌


జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇన్‌చార్జి సీఈవో అనూప్‌సింగ్‌ సూచించారు. శుక్రవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో మాట్లాడారు.
   
ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌):  జిల్లాలో నూతన ఓటర్ల నమోదు, ఓట రు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి జనవరి 23వ తేదీ నుంచి ఈ నెల 14 వరకు చేపట్టే క్లెయిమ్, అభ్యంతరాల నమోదు ప్రక్రియ పక్కాగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇన్‌చార్జి  సీఈవో అనూప్‌సింగ్‌ సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. ఈ నెల 4, 11 తేదీల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు, ఓటరు జాబితాను పరిశీలించాలన్నారు. బూత్‌స్థాయి అధికారులు తప్పకుండా ఇంటింటికి వెళ్లేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గ ఈ ఆర్‌వోలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 5న క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత మార్చి 15లోగా మొత్తం జాబితా అప్‌డేట్‌ చేయాలన్నారు. మార్చి 22న లోగా ఓటరు జాబితాను ముద్రించి 24న పబ్లికేషన్‌ చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా పర్యవేక్షణ అధికారిగా మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్ధ అదనపు డీడీ బూసాని వెంకటేశ్వర్‌రావును నియమించామన్నారు. ఓటరు జాబితా పర్యవేక్షకులు జిల్లాలో పర్యటించే తేదీలను నిర్ణయించి సమాచారం అందించాలన్నారు. పరిశీలకుల పర్యటన సందర్భంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కావాలన్నారు. అంతకు ముందే జిల్లా స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటరు జాబితా హార్డ్, సాఫ్ట్‌ కాపీలను వారి పరిశీలన కోసం అందజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ ఎం.రామ్మోహన్‌రావు, జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, నిజామాబాద్‌ ఆర్‌డీవో వినోద్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్‌ జాన్‌సాంసన్, నియోజకవర్గ ఈఆర్‌వోలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


పరిశుభ్రత పాటించాలి 


ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇన్‌చార్జి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి నిజామాబాద్‌ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ కార్యాలయంలోని ఆయా విభాగాలతో పాటు పరిసరాలను తిరిగి పరిశీలించారు. సెక్షన్‌ల వారీగా, కంప్యూటర్‌గది, డీఏవో, డీటీల గదులను పరిశీలించారు. రికార్డు గదికి వెళ్లి అక్కడ ఎన్నేళ్లకు సంబంధించిన రికార్డులున్నాయాని అడిగి తెలుసుకున్నారు. సంవత్సరం వారీగా రికార్డులను భద్రపర్చాలని ఆదేశించారు. కార్యాలయాలు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పనికి రాని పాత ఫర్నిచర్‌ ఉంటే తొలగించాలన్నారు.  

మరిన్ని వార్తలు