వరదొచ్చేదాకా ...  ఎదురుచూపే 

31 May, 2020 02:13 IST|Sakshi

కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో 525 టీఎంసీల నీటి కొరత

రేపటి నుంచి కొత్త వాటర్‌ ఇయర్‌ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గతేడాది విస్తారంగా కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదలతో ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై భారీ ఆశలే నెలకొన్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఖాళీ అవగా నైరుతి రుతుపవనాల రాక సకాలంలో ఉంటుందన్న అంచనాలు రాష్ట్రానికి ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు బేసిన్‌ల పరిధిలో 525 టీఎంసీల లోటు ఉండగా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే సకాలంలో సమృద్ధిగా కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది.

వరదలొస్తేనే ప్రాజెక్టులకు ఊతం.. 
రాష్ట్రంలో ఖరీఫ్, యాసంగి సాగు అవసరాలకు భారీగా నీటి వినియోగం చేయడంతో ప్రాజెక్టులు నిండుకున్నాయి. అంతకుముందు ఏడాదులతో పోలిస్తే నిల్వలు కొంత మెరుగ్గానే ఉన్నా అవి తాగునీటికి తప్ప సాగు అవసరాలను తీర్చలేవు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకుగాను ప్రస్తు తం 327 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో ప్రస్తుతం 172 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా ఇందులో కనీస నీటిమట్టాలకు ఎగువన ఉన్నది కేవలం 35 టీఎంసీలే.

ఈ నీటినే జూలై చివరి వరకు రాష్ట్రం వినియోగించుకోవాల్సి ఉంది. ఇక శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను కేవలం 35 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లోనే 210 టీఎంసీల నీటి కొరత ఉంది. అవి నిండితే కానీ శ్రీశైలానికి వరద కొనసాగే పరిస్థితి లేదు. గతేడాది భారీ వరదల కారణంగా జూలైలోనే 220 టీఎంసీల మేర నీరొచ్చింది. ఈ ఏడాది సైతం అలా వస్తేనే శ్రీశైలం నిండే అవకాశం ఉంది.  

ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో)

మరిన్ని వార్తలు