మందు తాగి పట్టు బడితే అంతే..

30 Dec, 2019 19:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకలకు రాత్రి 1 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఈవెంట్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు. మందు బాబుల ఆటకట్టించేందుకు 50 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లై ఓవర్లను సాయంత్రం నుంచే మూసివేస్తామని.. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లే వారు ఫ్లయిట్ టికెట్ వివరాలు చూపిస్తేనే అనుమతి ఉంటుందన్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించిన వారు క్యాబ్ సర్వీసెస్‌లను ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. మైనర్‌లు వాహనాలు నడిపి పట్టు బడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్‌లో ఎక్కువగా ఈవెంట్స్, పబ్‌లు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లకు మద్యం తాగడానికి అనుమతి ఇచ్చిన వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ఏడాది జరిగిన గొడవల నేపథ్యంలో ఈ ఏడాది ప్రతి ఈవెంట్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీసీపీ విజయ్‌ కుమార్‌ చెప్పారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రహదారులపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్న రహదారులను వదిలేసి ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

- ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్ మోటర్ వెహికిల్స్‌ను అనుమతించరు
- పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైనా వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరణ
- కేవలం శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వారికి మాత్రమే ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి అనుమతిస్తారు
- లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు యథాతథం
- గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ల మూసివేత
- కామినేని, ఎల్బీనగర్ ఫ్లైఓవర్, చింతల్ కుంట అండర్ పాస్‌ల మూసివేత
- తెలుగుతల్లి ఫ్లైఓవర్, నల్గొండ చౌరస్తా పైవంతెన, పంజాగుట్ట ప్లైఓవర్ మూసివేత
- వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం పలు చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు
- మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు
- రాత్రి 10 నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌పైకి వాహనాల రాకపోకలు నిలిపివేత                                           
- ఆ దారుల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని సూచించిన ట్రాఫిక్ పోలీసులు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా