జిల్లాకో జెడ్పీ

14 Feb, 2019 07:43 IST|Sakshi

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): తెలంగాణ ప్రభుత్వం పారిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నాలుగు జిల్లాలుగా విడిపోయింది. దీనికి తోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నేడో, రేపో నారాయణపేట జిల్లాగా ఏర్పడనుంది. తద్వారా జిల్లాల సంఖ్య ఐదుకు చేరుతుంది. అయితే, జిల్లాల విభజన తర్వాత అన్ని శాఖల్లో దస్త్రాలు, ఉద్యోగులను పంపిణీ చేసినా... జిల్లా పరిషత్‌ మాత్రం మిగిలిపోయింది.

తాజాగా కొత్తగా అవిర్భవించిన జిల్లాలకు అనుగుణంగా జెడ్పీలు ఏర్పాటు చేయడానికి పంచాయతీరాజ్‌ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న నారాయణ పేట జిల్లాతో కలిపి మొత్తం ఐదు జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. చైర్మన్, వైస్‌ చైర్మ న్‌ వంటి పదవులతోపాటు పెరిగిన మండలా ల వారీగా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు పెరగనున్నాయి. ఈ విషయమై వివిధ పార్టీల్లోని ఆ శావహుల్లో ఉత్సాహం నెలకొంది. రాబోయే జె డ్పీ ఎన్నికలు సైతం జిల్లాల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జెడ్పీతోనే గ్రామీణాభివృద్ధి 
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్‌ కీలకపాత్ర పోషిస్తోంది. కొత్త పనులు చేపట్టాలన్నా.. సమస్యలు పరిష్కారం కావా లన్నా జెడ్పీ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు జెడ్పీ సమావేశాలకు హాజరవుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. అందుకే జిల్లా పరిషత్‌ çచైర్మన్‌కు రాష్ట్ర సహాయ మంత్రితో సమాన హోదా ఉంటుంది.

ఉన్న సిబ్బందితోనే... 
నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో జెడ్పీలు కొలు వు దీరనుండడంతో పూర్వ వైభవం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో జిల్లా పరిషత్‌ కార్యాలయం ఉండగా కొత్తగా నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాలతో పాటు నారాయణపేట జిల్లాలోనూ జిల్లా పరిషత్‌లు ఏర్పాటుకానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జెడ్పీ కార్యాలయంలోని సిబ్బందినే కొత్త జెడ్పీ కార్యాలయాలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా జిల్లాలు ఏర్పడినప్పడు కూడా రెవెన్యూ, పోలీస్, ఇత ర శాఖల్లోని అధికారులు, సిబ్బందిని ఉమ్మడి జిల్లా కార్యాలయాల నుంచే విభజించి వర్క్‌ టూ సర్వు కింద విభజించారు. అదే మాదిరిగా జిల్లా పరిషత్‌ ఉద్యోగుల విషయంలో వ్యవహరించన్నుట్లు సమాచారం.
 
పీఆర్‌ మండలాలుగా గుర్తిస్తేనే... 
కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో నూతన మండలాలు కూడా ఏర్పడ్డాయి. పాతవి, కొత్తగా ఏర్పడిన మండలాలు కలిపి మొత్తం సంఖ్య మహబూబ్‌నగర్‌లో 26, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 20, వనపర్తిలో 14 మండలాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 12కు చేరింది. ఇందులో కొత్తగా ఏర్పడిన మండలాలను రెవెన్యూ మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం తహసీల్దార్‌ కార్యాలయాలను ఏర్పాటుచేసింది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్‌ మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం తిరిగి ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అక్కడ మండల పరిషత్‌ కార్యాలయాలు ఏర్పడతాయి. కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కొత్త మండలాలను పీఆర్‌ మండలాలుగా గుర్తించలేదు. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అలా అన్ని గ్రామీణ మండలాలు పంచాయతీరాజ్‌ పరిధిలోకి వచ్చాక జెడ్పీ ఎన్నికల ప్రక్రయ ప్రారంభం కానుంది.
 
ప్రస్తుతం ఉమ్మడిగానే సమావేశాలు 
ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పాటైనా జిల్లా పరిషత్‌ సమావేశాలు మాత్రం ఉమ్మడి జిల్లా వారీగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాలు, జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు ఉమ్మడిగానే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రాంతం లో ఏర్పడిన నాలుగు జిల్లాలతో పాటు కొన్ని మండలాలు కలిసిన వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు సైతం హాజరవుతున్నారు. అయితే, కొత్తగా ఏర్పడిన జిల్లాకు చెందిన సభ్యులు పలువురు సమావేశాలు హాజరఅయ్యేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు కూడా జెడ్పీటీసీ సభ్యులు అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. ఒక్క జెడ్పీ సర్వçసభ్య సమావేశాలకు మాత్రమే సభ్యులు హాజరవుతుండడం గమనార్హం.

జున్‌తో ముగియనున్న పదవీకాలం 
ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పరిషత్‌ పాలక మండలి పదవీ కాలం గడువు ఈ ఏడాది జూన్‌ నెలతో ముగియనుంది. తదనంతరం జెడ్పీటీసీల వ్యవస్థను కొనాగించాలా, వద్దా అనే అంశంపై పంచాయతీరాజ్‌ శాఖ జెడ్పీ చైర్మన్ల సమావేశంలో చర్చకు తీసుకొచ్చింది. అయితే, ఎక్కువ మంది వ్యవస్థను కొనసాగించొద్దనే భావన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

భారీగానే ఆశావాహులు 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం కొత్తగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేయనుందనే ప్రచారంతో ఆశావహుల్లో జోష్‌ నెలకొంది. జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది చైర్మన్‌ లేదా వైస్‌ చైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త జిల్లాలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడంతో నిరాశలో కూరుకుపోయిన వారిలో తాజా ప్రచారం ఉత్సాహాన్ని కలిగిస్తోంది. కొత్తగా మండలాల జెడ్పీటీసీలుగా గెలుపొందితే తొలి సభ్యుడిగా రికార్డు ఉంటుందనే భావనతో పలువురు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులుగా తమను ప్రకటించాలనే పార్టీల వారీగా అధినాయకత్వాన్ని కోరుతున్నారు. 

ఆదేశాలు రాలేదు..
కొత్త జిల్లాల వారీ గా జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సమాచారం కానీ మార్గదర్శకాలు కానీ అందలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిన నేపథ్యంలో కొత్త జెడ్పీలు కూడా ఏర్పాటు జరుగుతాయనే ప్రచారం మాత్రం సాగుతోంది. అయితే, అధికారిక సమాచారంలేదు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చి నా అందుకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగిస్తాం.   – వసంతకుమారి, జెడ్పీ సీఈఓ, మహబూబ్‌నగర్‌  

మరిన్ని వార్తలు